కరోనా రెండోదశతో దేశం అతలాకుతలం అవుతుండగా.. కేంద్రం కీలక వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడిప్పుడే కేసులు తగ్గుముఖం పడుతున్నట్లు కనిపించినా.. అప్పుడే ముప్పు తప్పిపోలేదని, భవిష్యత్తులో వైరస్ విజృంభించి గరిష్ఠ స్థాయికి చేరుకునే అవకాశం ఉందని పేర్కొంది. వైరస్ను ఎదుర్కొవడానికి జాతీయ స్థాయిలో సన్నద్ధంకావాలని సూచించింది. మౌలిక సదుపాయాలు మెరుగుపరచాల్సిన అవసరం ఉందని, ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు నీతి ఆయోగ్ సభ్యులు వీకే పాల్.
"కొవిడ్ భవిష్యత్తులో విజృంభించే అవకాశాలు ఉన్నాయి. ఒకానొక దశలో గరిష్ఠ స్థాయికి చేరుతుంది. అందుకే రాష్ట్రాల సహకారంతో జాతీయ స్థాయిలో సన్నాహాలు జరగాలి. మౌలిక సదుపాయాలు పెరగాలి. నియంత్రణ చర్యలు అమలు చేయాలి. కరోనాకు తగిన ప్రవర్తనను అనుసరించాలి. అయితే ఎవరినీ భయాందోళనకు గురిచేడానికి కాదు.. ఇతర దేశాలు ఎదుర్కొన్న పరిస్థితుల ఆధారంగానే ఈ అంచనా వేశాం. ఇది ఒక మహమ్మారి."