Peacock Video: అయిన వారు ఏ కారణంతోనైనా దూరమైతే ఆ బాధ మాటల్లో చెప్పలేం. ఇక వారు చనిపోతే.. ఆ బాధకు అంతే ఉండదు. ఏడుస్తారు.. డిప్రెషన్‌లోకి వెళ్తారు. మళ్లీ కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. మనుషుల్లో ఈ భావోద్వేగం సహజం.. కానీ జంతువుల్లో, పక్షుల్లో కూడా ఇలా ఉంటుందంటే నమ్ముతారా? ఓ నెమలిలో అంత ఎమోషన్ కనిపించింది.
వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్ కుచేరాలో హృదయ విదారక దృశ్యం కనిపించింది. ఓ నెమలి మృతిచెందగా.. దానిని సంచిలో పట్టుకొని తీసుకెళ్తున్నారు ఇద్దరు యువకులు. వారి వెంటే నడుచుకుంటూ వెళ్తోంది మరో మయూరం. విగతజీవిగా పడి ఉన్న తన భాగస్వామిని అలా తీసుకెళ్తుంటే.. ఏం చేయాలో తెలియట్లేదు పాపం. మరణంలోనూ వదిలి వెళ్లలేక.. ఆ నెమలి దానినే అనుసరిస్తున్నట్లు వీడియోలో చూడొచ్చు.
హృదయాల్ని హత్తుకునే ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. భారత అటవీ శాఖ అధికారి పర్వీన్ కాస్వాన్.. సంబంధిత వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. తనకు వాట్సాప్లో ఈ క్లిప్ వచ్చిందని చెప్పారు.
ఇది రాజస్థాన్ కుచేరాలో జరిగిందని మరో ట్వీట్ చేశారు. ఆ రెండు నెమళ్లు నాలుగేళ్లు కలిసి జీవించినట్లు అందులో ఉంది.
దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. మనుషుల కంటే జంతువులు/పక్షులు ఎక్కువ ప్రేమ, ఆప్యాయత చూపించుకుంటాయని ఒకరు అన్నారు.