తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఉమ్మడి అభ్యర్థి'పై విపక్షాల ఏకాభిప్రాయం.. పవార్​ను ఒప్పించటంలో విఫలం! - విపక్షాల ఉమ్మడి అభ్యర్థి

రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని బరిలో నిలపాలని తీర్మానించాయి 17 పార్టీలు. అయితే, ఎన్​సీపీ అధినేత శరద్​ పవార్​ ఒప్పించటంలో విఫలమయ్యాయి. ఈ క్రమంలో మరో ఇద్దరు నేతల పేర్లు తెరపైకి వచ్చాయి. మరోవైపు.. ఈ ఎన్నికలను ఏకగ్రీవం చేసేందుకు భాజపా పావులు కదుపుతోంది. ఉమ్మడి అభ్యర్థి ప్రకటనపై ఈనెల 20-21 మధ్య విపక్షాలు మరోమారు భేటీ కానున్నాయని సమాచారం.

OPPN MEETING
'ఉమ్మడి అభ్యర్థి'పై విపక్షాల ఏకాభిప్రాయం

By

Published : Jun 15, 2022, 6:50 PM IST

Updated : Jun 15, 2022, 8:04 PM IST

రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని బరిలో నిలపాలని 17 పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఈ మేరకు ఎన్​డీఏపై పోటీలో ఉమ్మడి అభ్యర్థిని నిలిపేందుకు తీర్మానించాయి. అయితే, మొదటి నుంచి అనుకుంటున్నట్లు ఎన్​సీపీ అధినేత శరద్​ పవార్​ను ఒప్పించటంలో విఫలమయ్యాయి. రాష్ట్రపతి ఎన్నికలు సమీపిస్తున్న వేళ దిల్లీలోని కాన్​స్టిట్యూషన్​ క్లబ్​లో బంగాల్​ ముఖ్యమంత్రి నేతృత్వంలో 17 పార్టీల నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా.. ఎన్​సీపీ చీఫ్​ శరద్​ పవార్​ను ఒప్పించే ప్రయత్నం చేశారు నేతలు. వారి ఆఫర్​ను పవార్ మరోమారు తిరస్కరించినట్లు వారు తెలిపారు. ఈ సమావేశానికి కాంగ్రెస్​, సమాజ్​వాదీ, ఎన్​సీపీ, డీఎంకే, ఆర్​జేడీ, వామపక్షాలు​ సహా మొత్తం 17 పార్టీల నేతలు హాజరవగా.. ఆప్​, తెరాస​, బీజేడీ, శిరోమణి అకాలీదళ్​ దూరంగా ఉన్నాయి.

"రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయాలని శరద్​ పవార్​ను అన్ని పార్టీల నేతలు కోరారు. కానీ, ఆ ప్రతిపాదనను పవార్ తిరస్కరించారు. భాజపాయేతర పార్టీలన్నింటితో ఉమ్మడి అభ్యర్థిపై చర్చించాలని పలువురు నేతలు మల్లికార్జున్​ ఖర్గే, పవార్​, మమతను కోరారు. "

- టీఆర్​ బాలు, డీఎంకే నేత

తెరపైకి మరో ఇద్దరి పేర్లు:శరద్​ పవార్​ సరైన అభ్యర్థిగా భావిస్తున్న విపక్షాలు మరోమారు ఆయనను ఒప్పించే ప్రయత్నం చేసే అవకాశం ఉన్నట్లు ఆర్​జేడీ నేత మనోజ్​ ఝా పేర్కొన్నారు. మరోవైపు.. అన్ని పార్టీలకు ఆమోదయోగ్యమైన అభ్యర్థే విపక్షాల తరఫున బరిలో నిలుస్తారని సీపీఐ నేత బినోయ్​ విశ్వమ్​ తెలిపారు. బుధవారం జరిగిన సమావేశం కేవలం శరద్​ పవార్​ పేరు మాత్రమే చర్చకు వచ్చినట్లు చెప్పారు. మరోవైపు.. ఫరూక్​ అబ్దుల్లా, గోపాలక్రిష్ణ గాంధీ పేర్లను మమతా బెనర్జీ సూచించినట్లు ఆర్​ఎస్​పీ నేత ఎన్​కే ప్రేమ్​చంద్రన్​ వెల్లడించారు.

కాంగ్రెస్​ది నిర్మాణాత్మక పాత్ర:రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని నిలిపేందుకు విపక్షాల మధ్య ఏకాభిప్రాయంలో కాంగ్రెస్​ నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుందన్నారు ఆ పార్టీ సీనియర్​ నేత మల్లికార్జున్​ ఖర్గే. ఉమ్మడి అభ్యర్థిని ఎంపిక చేసే విషయంలో విపక్షాలు క్రియాశీలకంగా వ్యవహరించాలని సూచించారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి రాజ్యాంగం, లౌకికతత్వాన్ని కాపాడుతూ.. విద్వేష శక్తులకు వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తి అయి ఉండాలన్నారు.

అభ్యర్థిత్వంపై అప్పుడే మాట్లాడటం సరికాదు:రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల తరఫున బరిలో నిలిచేందుకు శరద్​ పవార్​ ఆసక్తి చూపకపోవటం వల్ల గోపాలక్రిష్ణ గాంధీ పేరు చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలో రాష్ట్రపతి అభ్యర్థిత్వంపై మాట్లాడేందుకు ఇది సరైన సమయం కాదన్నారు ఆయన. 2017లో జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వెంకయ్య నాయుడిపై పోటీ చేసి ఓటమిపాలయ్యారు గోపాలక్రిష్ణ గాంధీ. ​

మమత, ఖర్గేలతో రాజ్​నాథ్​ భేటీ:విపక్షాలు ఉమ్మడి అభ్యర్థిని పోటీలో నిలపాలని చూస్తున్న తరుణంలో.. రాష్ట్రపతి ఎన్నికలను ఏకగ్రీవం చేసేందుకు భాజపా పావులు కదుపుతోంది. ఇప్పటికే పలువురు విపక్ష నేతలతో సంప్రదింపులు జరిపిన రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​.. తాజాగా మల్లికార్జున్​ ఖర్గే, మమతా బెనర్జీ, అఖిలేశ్​ యాదవ్​తో మాట్లాడినట్లు భాజపా వర్గాలు తెలిపాయి.

జూన్​ 20-21 మధ్య మరోమారు భేటీ:రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని నిలపాలని తీర్మానించాయి 17 పార్టీలు. అయితే, అభ్యర్థి పేరును ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో ఎన్​సీపీ అధినేత శరద్​ పవార్​ నేతృత్వంలో జూన్​ 20-21 మధ్య మరోమారు సమావేశం కానున్నట్లు సీనియర్​ నేతలు తెలిపారు. ఈ సమావేశంలో పార్టీలు పలువురు అభ్యర్థులను పేర్లను ప్రతిపాదించే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. మరోవైపు.. ఇప్పటికే నేషనల్​ కాన్ఫరెన్స్​ చీఫ్​ ఫరూక్​ అబ్దుల్లా, గోపాల క్రిష్ణ గాంధీల పేర్లను ప్రతిపాదించారు బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.

ఇదీ చూడండి:రాష్ట్రపతి ఎన్నికపై ఖర్గే- రాజ్​నాథ్ కీలక చర్చలు.. ఏకగ్రీవం దిశగా...!

ఉమ్మడి అభ్యర్థితో రాష్ట్రపతి ఎన్నికల బరిలోకి.. 17 పార్టీల తీర్మానం

'కాంగ్రెస్ ఆఫీస్​లోకి పోలీసులు.. కార్యకర్తలపై లాఠీఛార్జ్​!'.. నిజమెంత?

Last Updated : Jun 15, 2022, 8:04 PM IST

ABOUT THE AUTHOR

...view details