pawan kalyan: టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ.. సూచనప్రాయంగా వెల్లడించిన పవన్ - పవన్ కల్యాణ్
15:49 July 18
జగన్ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు అందరూ కలిసి పోరాడాలి : పవన్ కల్యాణ్
Pawan Kalyan: వచ్చే ఎన్నికల్లో ఏపీలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసే అవకాశం ఉందని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సూచనప్రాయంగా తెలిపారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోందన్న పవన్..జగన్ ప్రభుత్వాన్ని సాగనంపడానికి అందరూ కలిసి పోరాడాలని పేర్కొన్నారు. కూటమి నుంచి ముఖ్యమంత్రి పదవి ఎవరికి అన్నది ఎన్నికల ఫలితాల్లో బలబలాలను బట్టి నిర్ణయం ఉంటుందని పవన్ తెలిపారు. తనకు ముఖ్యమంత్రి పదవి ముఖ్యం కాదని జగన్ ప్రభుత్వాన్ని సాగనంపడమే ముఖ్యమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉద్యోగాల కల్పన ఊసేలేదు... ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని మండిపడ్డారు.
రోజుకి రూ.160 జీతం ఇచ్చి పెట్టుకున్న ప్రైవేటు వ్యక్తుల ద్వారా ప్రజల డేటా అంతా చోర్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధార్, వేలిముద్రలు, ఐరిష్ డేటా అంతా తెలంగాణలో నిక్షిప్తం చేస్తున్నారని వెల్లడించారు. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరిగిందని, ప్రభుత్వాన్ని ఎదిరించే వారు కావాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. అందుకే జనసేనకు ఏపీలో ప్రజల నుంచి మద్దతు వస్తోందని తెలిపారు. రాష్ట్రంలో ప్రజలు తీవ్ర నిరాశ, నిస్పృహతో ఉన్నారని, మీడియాలో కనిపిస్తున్న దానికి వాస్తవ పరిస్థితులకు పొంతన లేదని పవన్ వెల్లడించారు. కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు చెల్లించే పరిస్థితి లేదని, తనకు అనుయాయులుగా ఉన్న వారికి మాత్రం పది శాతం వడ్డీతో రుణాలు తీసుకొచ్చి రాష్ట్ర సొమ్మును ధారాదత్తం చేస్తున్నారని పవన్ మండిపడ్డారు.
ఐక్యత పేరుతో కాంగ్రెస్ ఆధ్వర్యాన ప్రతిపక్ష పార్టీలు బెంగళూరులో సమావేశం కాగా, మరోవైపు దిల్లీ వేదికగా బీజేపీ తమ బలాన్ని ప్రదర్శిస్తోంది. ఈ మేరకు పార్టీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ)లో కొత్త భాగస్వామ్యులు కూడా హాజరయ్యాయి.గతంలో ఎన్డీఏ నుంచి వైదొలిగిన పార్టీలను సైతం తిరిగి కూటమిలోకి తీసుకొచ్చేందుకు అనేక ప్రయత్నాలు చేసిన బీజేపీ... ఈ సమావేశం ద్వారా 2024 ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనుందని తెలుస్తోంది. జాతీయ ప్రజాస్వామ్య కూటమి భేటీకి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో పాటు ఏపీ నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు బీజేపీ పెద్దలు ఆహ్వానం పంపించారు. ఈ నేపథ్యంలో దిల్లీ చేరిన పవన్‌కల్యాణ్.. రాష్ట్రంలో పొత్తులపై మీడియాతో మాట్లాడారు.