ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వివాదంలో కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేడాకు దేశ సర్వోన్నత న్యాయస్థానం మంజూరు చేసిన మధ్యంతర బెయిల్‌ను మార్చి 3 వరకు పొడిగించింది.
ప్రధాని మోదీ పేరును వక్రీకరించి పలికినందుకుగానూ పవన్ ఖేడా ఈ వివాదంలో చిక్కుకున్నారు. ఈ కేసులో ఖేడాను అసోం పోలీసులు ఈ నెల 23న దిల్లీ పోలీసుల సాయంతో దిల్లీ విమానాశ్రయంలోనే హైడ్రామా నడుమ అరెస్టు చేశారు. అయితే ఖేడాకు కాసేపటికే సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. వివిధ నగరాల్లో ఆయనపై నమోదైన ఎఫ్ఐఆర్లకు సంబంధించి పూర్తి వివరాలు తమకు సమర్పించాలని అసోం, ఉత్తప్ప్రదేశ్ పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు సోమవారం రెండు రాష్ట్రాల తరఫున హాజరైన న్యాయవాదులు తుషార్ మెహతా, గరిమా ప్రసాద్ ఈ విషయంపై సంబంధిత పోలీసులు తమ వివరణను త్వరలోనే తెలియజేస్తారని జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనానికి నివేదించారు. ఇరు రాష్ట్రాల వాదనలతో సంతృప్తి చెందిన న్యాయమూర్తులు ఈ కేసు విచారణను వచ్చే నెల 3కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఫిబ్రవరి 23న ఖేడాకు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్ గడువు కూడా అప్పటి వరకు అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు.
మోదీపై అనుచిత వ్యాఖ్యల కేసులో పవన్‌కు మరింత ఊరట.. అప్పటివరకు బెయిల్ పొడిగింపు - పవన్ ఖేడా
ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేడాకు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్‌ను వచ్చే నెల 3 వరకు పొడిగించింది.
ఇదీ జరిగింది..
ప్రధాని మోదీపై ఈ నెల 17న ముంబయిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఖేడా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసారు. దీనిపై అసోం బీజేపీ నేత ఒకరు అసోంలోని దిమా హసావో జిల్లాలోని హఫ్లాంగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారణాసి, లఖ్‌నవూ నగరాల్లో కూడా పవన్ ఖేడాపై ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. దిల్లీ పోలీసులు సహకారంతో ఆయన్ను ఫిబ్రవరి 23న అసోం పోలీసులు హైడ్రామా నడుమ దిల్లీ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. ఈ విషయంపై కాంగ్రస్ నేతలు సుప్రీంను ఆశ్రయించడం వల్ల పవన్‌కు ఊరట లభించింది. కాగా, ఆ సమయంలో పవన్ ఈ నెల 24 నుంచి 26 వరకు రాయ్‌పుర్‌లో జరిగిన కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలకు హాజరయ్యేందుకు పలువురు సీనియర్ నేతలతో కలిసి విమానం వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఫ్లైట్ టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే ఎయిర్‌లైన్స్ సిబ్బంది ఆయన్ను ఏదో లగేజీ విషయంలో గందరగోళం ఉందని.. కిందకు దిగవల్సిందిగా కోరడం వల్ల ఈ రచ్చ మొదలైంది.