Pawan Kalyan Varahi yatra: తనకు అవకాశం వస్తే ఈ గూండాలను వీధుల్లో తన్నుకుంటూ తీసుకెళ్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెల్లడించారు. కాకినాడ జిల్లా సర్పవరం కూడలిలో పవన్ వారాహి విజయ యాత్ర సభ నిర్వహించారు. వారాహి వాహనంపై ర్యాలీగా ముత్తా క్లబ్ నుంచి సభ వద్దకు వచ్చారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌ను చూడటానికి జనసేన కార్యకర్తలు పవన్ అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. 2009లోనే తాను పూర్తిగా రాజకీయాల్లోకి వస్తే జగన్‌ను అధికారంలోకి రానిచ్చేవాడిని కాదని పేర్కొన్నాడు. సీఎం జగన్.. దోపిడీదారుడు, నేరస్తుడని ఆరోపించాడు. కాకినాడ జనవాణిలో సమస్యలు వింటుంటే బాధ కలిగిందిని పవన్ కల్యాణ్ పేర్కొన్నాడు.
సీఎం అండతోనే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ జిల్లాను లూటీ చేస్తున్నారని పవన్ ఆరోపించారు. అందులో భాగంగానే ద్వారంపూడి.. నేర సామ్రాజ్యం నడుపుతున్నారని విమర్శించాడు. ద్వారంపూడి ఇంట్లోని అందరూ గూండాలని తెలిసిందని వెల్లడించారు. ఎమ్మెల్యే ద్వారంపూడిని ఈసారి గెలవకుండా చేస్తానని పవన్ సవాలు విసిరారు. ద్వారంపూడి దగ్గరున్న గూండాలకు కాకినాడలో నిలబడి హెచ్చరిస్తున్నానన్న పవన్.. ద్వారంపూడి అక్రమాల జాబితా అంటూ... పవన్ కల్యాణ్ ఓ జాబితాను చదివి వినిపించారు. నేటి నుంచి ద్వారంపూడీ పతనం ప్రారంభమైందంటూ హెచ్చరించారు. ద్వారంపూడి నేరసామ్రాజ్యాన్ని కూల్చకుంటే నా పేరు పవన్ కాదంటూ సవాలు విసిరారు.