ఏలూరు సభలో పవన్ సంచలన వ్యాఖ్యలు Pawan Comments on Women Trafficking in AP: రాష్ట్రంలో మహిళల అదృశ్యాలకు వాలంటీర్లే కారణమని.. వైసీపీ పాలనలో అదృశ్యమైన 30 వేల మందిలో 14 వేల మంది ఆచూకీ ఇప్పటికీ తెలియదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వారాహి విజయయాత్ర రెండో విడతలో భాగంగా ఏలూరు నిర్వహించిన బహిరంగసభలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వంతో పాటుసీఎం జగన్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మానవ అక్రమ రవాణా జరుగుతోందని కేంద్ర నిఘా వర్గాలే హెచ్చరించినట్లు వెల్లడించారు. వైసీపీ తీసుకువచ్చిన వాలంటరీ వ్యవస్థ ద్వారా సేకరిస్తున్న ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని.. సంఘ విద్రోహ శక్తులకు చేరవేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో నాలుగేళ్లలో 30 వేల మంది యువతులు అదృశ్యం కావడమే ఇందుకు నిదర్శనమన్నారు.
కాగ్ ప్రశ్నలకు సమాధానమేదీ?:10 లక్షల కోట్ల రాష్ట్ర ఖజానాను దేని కోసం ఖర్చు చేశారో చెప్పాలని పవన్ డిమాండ్ చేశారు. నిధుల దారి మళ్లింపు, దుర్వినియోగంపై 25 లోపాలను కాగ్ ఎత్తిచూపడం ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. గత సంవత్సరం ప్రభుత్వం చేసిన ఖర్చులపై కాగ్ నివేదికలో అక్రమాలన్నీ బయటపడ్డాయని.. రాష్ట్రంలో చేసే ఖర్చులు ఎవరికీ తెలియకుండా ప్రభుత్వం దోపిడీకి తెర తీస్తోందని ఆరోపించారు. ఈ దోపిడీపై కాగ్ 25 లోపాలను ఎత్తిచూపిందని.. రాష్ట్రాభివృద్ధి పేరుతో రూ.22వేల 504 కోట్లు అప్పు చేసి లెక్కాపత్రం లేకుండా దోచేశారని ఆగ్రహించారు. రహదారులను అభివృద్ధి చేస్తామని రూ.4వేల 754 కోట్లు తీసుకుని ఏం చేశారు? మీరు రోడ్లు వేస్తే 37వేల 942 ప్రమాదాలు ఎందుకు జరుగుతాయి? 14వేల 230 మంది అమాయకులు ఎందుకు ప్రాణాలు పోగొట్టుకుంటారు? అని ప్రశ్నించారు.
నాన్ రెసిడెంట్ నాయకుడంటున్న వాళ్లకు గట్టి కౌంటర్: తాను హైదరాబాద్‌లో ఉంటానని సీఎం పదేపదే అంటున్నారని.. తాను జగన్‌లా అడ్డగోలుగా సంపాదించడం లేదన్నారు. జగన్ తండ్రిలా.. తన తండ్రి సీఎం కాదని.. ఆయనలా ప్రతి పనికి 6 శాతం కమీషన్లు తీసుకునే పరిస్థితి లేదని విమర్శించారు. తన తండ్రి ఓ సాధారణ ప్రభుత్వ ఉద్యోగి అని స్పష్టం చేశారు. తాను సినిమాలు తీసి వచ్చిన డబ్బులు కష్టాల్లో ఉన్న కౌలు రైతులకు పంచుతున్నానని.. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకుంటున్నాని తెలిపిన పవన్... నువ్వెప్పుడైనా ప్రజల వద్దకు వచ్చావా? పరదాలు, బారికేడ్లు కట్టుకుని వెళుతున్నావని జగన్‌పై విమర్శలు సంధించారు. అలా వచ్చి వెళితే తాడేపల్లిలో ఉంటేనేం.. దాచేపల్లిలో ఉంటేనేం అని ధ్వజమెత్తారు. ఇండియా టిక్‌టాక్, చైనా ఫేస్‌బుక్ బ్యాన్ చేశాయని.. జగన్ మాత్రం రాష్ట్ర పరిస్థితులు ప్రజలకు తెలియకుండా చేసేందుకు జీవోలను బ్యాన్ చేస్తున్నారని మండిపడ్డారు.
జగన్‌ను ఏకవచనంతోనే పిలుస్తా: తాను ప్రజల అభివృద్ధి గురించి, సమాజ పురోగతి గురించి మాట్లాడుతుంటే.. జగన్ మాత్రం సభ్యత లేకుండా తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడి కించపరుస్తున్నారని ధ్వజమెత్తారు. తనకు రాజకీయాలు అవసరం లేదని.. సినిమాలు చేసుకుని హాయిగా ఉండగలను.. కానీ దగా పడుతున్న ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు. వైసీపీ నాయకులు తన తల్లిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారని.. రాజకీయాలతో సంబంధం లేని తన భార్య గురించి మాట్లాడతారని మండిపడ్డారు. ఇంత దిగజారి వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడే జగన్‌ను.. ఇక నుంచి ఏకవచనంతోనే మాట్లాడతా అని పవన్ కల్యాణ్ అన్నారు. అంతకుముందు.. వారాహి విజయయాత్ర మలిదశ కోసం ఏలూరు చేరుకున్న పవన్‌కల్యాణ్‌కు.. జనసేన కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున స్వాగతం పలికారు.