Patna High Court Cancelled Forcible Marriage :యువకుడితో బలవంతంగా యువతి నుదిటిపై బొట్టు పెట్టించినంత మాత్రాన అది హిందూ సంప్రదాయం ప్రకారం చెల్లుబాటు అయ్యే వివాహం కాదని పట్నా హైకోర్టు స్పష్టం చేసింది. వధూవరులిద్దరూ స్వచ్ఛందంగా పవిత్రమైన 'సప్తపది' చుట్టూ ప్రదక్షిణ చేసినప్పుడు మాత్రమే విహహం చెల్లుబాటు అవుతుందని పేర్కొంది. 'హిందూ వివాహ చట్టంలోని నిబంధనలను పూర్తిగా పరిశీలిస్తే.. సప్తపది చుట్టూ వధువరులిద్దరూ ఏడడుగులు నడిచినప్పుడు మాత్రమే పెళ్లి పూర్తి అవుతుంది. అంతేగానీ సప్తపది పూర్తికాకపోయే.. ఆ వివాహం పరిగణనలోకి రాదు' అని హైకోర్టు స్పష్టం చేసింది. పదేళ్ల క్రితం ఓ యువకుడిని కిడ్నాప్ చేసి.. బలవంతంగా యువతి నుదిటిపై బొట్టు పెట్టించిన ఘటనపై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. బలవంతంగా జరిగిన ఈ వివాహాన్ని రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది.
అసలేం జరిగిందంటే..
ఆర్మీలో సిగ్నల్ మ్యాన్‌గా పని చేసే రవికాంత్ అనే యువకుడు.. 2013 జూన్ 30వ తేదీన లఖిసరాయ్‌లోని 'అశోక్ ధామ్' దేవాలయానికి వెళ్లాడు. అప్పుడు అతడిని కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత తుపాకీతో బెదిరించి.. ఓ యువతి నుదిటిపై బలవంతంగా సిందూరం బొట్టు పెట్టించారు. ఇక నుంచి యువతి భర్త రవికాంత్నేనని వాదించారు. అప్పుడు బాధితుడు రవికాంత్.. ఆ బలవంతపు పెళ్లిని రద్దు చేయాలని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్‌ను 2020 జనవరి 27న కోర్టు తిరస్కరించింది. ఆ తర్వాత పట్నా హైకోర్టు ఆశ్రయించాడు రవికాంత్.
రవికాంత్ పిటిషన్‌పై విచారణ జరిపిన పట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బజ్నాత్రి కీలక తీర్పునిచ్చారు. బలవంతంగా చేసిన పెళ్లిపై దాఖలైన పిటిషన్‌ను ఫ్యామిలీ కోర్టు కొట్టివేయడం లోపభూయిష్టంగా ఉందని అన్నారు. యువకుడిని బెదిరించి బలవంతంగా యువతితో వివాహం చేయించడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. చట్ట ప్రకారం ఈ పెళ్లి.. చెల్లుబాటు కాదని తీర్పును ఇచ్చారు. దీంతో యువకుడికి భారీ ఊరట లభించింది.