గతంలో ఎన్నడూ చూడనంతగా పెను ముప్పును భారత్ ఎదుర్కొంటోంది. కరోనా సృష్టిస్తున్న విలయతాండవంతో రోజుకు రెండు వేల మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. దేశంలోని ఆసుపత్రులన్నీ కొవిడ్ రోగులతో నిండిపోయాయి. కొత్తగా వైరస్ బారిన పడుతున్న వారికి పడకలు దొరకని పరిస్థితి దేశవ్యాప్తంగా నెలకొంది. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి సైతం సరిపడ ఆక్సిజన్ లభించక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దిల్లీలోని శాంతి ముకాండ్ ఆసుపత్రి సీఈఓ సునీల్ సాగర్ తమ ఆసుపత్రిలో ఆక్సిజన్ సంక్షోభం తలెత్తడంతో భావోద్వేగానికి గురయ్యారు. రోగులకు సరిపడా ఆక్సిజన్ లేదన్న ఆయన.. వారు చనిపోయే పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఉత్తర్‌ప్రదేశ్ నోయిడాలోని కైలాష్ హాస్పిటల్‌లోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. మరికొద్ది గంటలకు సరిపడా ఆక్సిజన్ మాత్రమే తమ వద్ద ఉందని.. గ్రూప్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ రితు బోహ్రా తెలిపారు. కొత్తగా రోగులను చేర్చుకోవద్దని వైద్యులకు చెబుతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న అనేక ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపు పడకలు దొరక్కా.. దొరికినా ఆక్సిజన్ లేక రోగులు నరకయాతన అనుభవిస్తున్నారు. చేసేదేమీ లేక రోగులను.. డిశ్చార్జ్ చేయాలని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు వైద్యులకు సూచిస్తున్నాయి.
ఎంపీ, గుజరాత్లో పడకల కొరత..
మధ్యప్రదేశ్‌లోని భోపాల్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కరోనా కేసులు అధికంగా వస్తుండటంతో రోగులతో ఆసుపత్రులన్నీ నిండిపోయాయి. సెహోర్ జిల్లాలోని.. ఓ ఆసుపత్రిలో పడకలు ఖాళీ లేక కొత్తగా ఎవర్నీ చేర్చుకునేది లేదంటూ ఆసుపత్రి యాజమాన్యం గేటుకు నోటీసులు అంటించింది. ఆక్సిజన్ సిలెండర్ల కొరత అధికంగా ఉండటంతో.. వైరస్ బాధితులు ఆసుపత్రికి రావద్దని నోటిసులో పేర్కొంది. మరోవైపు గుజరాత్‌లోనూ ఆక్సిజన్ పడకలకు కొరత ఏర్పడటంతో దళారులు సొమ్ము చేసుకుంటున్నారు. రాజ్‌కోట్ ప్రభుత్వ ఆసుపత్రిలో.. 9వేలు చెల్లిస్తే ఆసుపత్రిలో పడక ఇప్పిస్తానని ఓ ఏజెంటు చెప్పడం సామాజిక మాద్యమాల్లో వైరల్‌గా మారింది.
రంగంలోకి వైమానిక దళం..
ఉత్తర్‌ప్రదేశ్ అలీగఢ్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో.. ఐదుగురు కరోనా రోగులు మృతి చెందారు. ఆక్సిజన్ కొరతతోనే తమ వారు చనిపోయారని.. బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే ఆసుపత్రి యాజమాన్యం ఈ ఆరోపణలను ఖండించింది. మరోవైపు దిల్లీలో విశ్రాంత బ్రిగేడియర్ రాష్‌పాల్ సింగ్ పర్మార్‌కు ఆర్మీ ఆసుపత్రిలో పడక లభించలేదు. దిల్లీలోని పలు ఆసుపత్రులకు తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో ఆయన మృతి చెందారు. అన్ని రాష్ట్రాల్లోనూ ఆక్సిజన్ కోసం డిమాండ్ పెరుగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆక్సిజన్ సరఫరాకు వైమానిక దళాన్ని రంగంలోకి దించింది. ఆక్సిజన్ కంటేనర్లు, సిలిండర్లతో పాటు అత్యవసర మందులు, సామాగ్రి, వైద్య సిబ్బందిని వైమానిక దళ విమానాల్లో తీసుకువెళ్తున్నారు. అలాగే అన్ని రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా కేటాయింపులను పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
యూపీ ఉప ముఖ్యమంత్రికి కరోనా..