తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బామ్మకు అస్వస్థత.. రిక్షా తోసుకుంటూ ఆస్పత్రికి తీసుకెళ్లిన బాలుడు - లేటెస్ట్ న్యూస్

అంబులెన్స్ అందుబాటులో లేకపోవడం వల్ల రోగులు ఇప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటిదే ఓ ఘటన తాజాగా తెరపైకి వచ్చింది. తన బామ్మ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించగా.. పరిస్థితిని చూసిన మనవడు ఆమెను రిక్షాపై ఆసుపత్రికి తీసుకెళ్లాడు.

patient taken hospital on wheelbarrow
తోపుడుబండిపై ఆస్పత్రికి తీసుకెళ్లిన మనువడు

By

Published : Dec 19, 2022, 4:17 PM IST

Updated : Dec 19, 2022, 7:30 PM IST

అస్వస్థతకు గురైన తన బామ్మను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అవస్థలు పడ్డాడు ఎనిమిదేళ్ల బాలుడు. అంబులెన్సు అందుబాటులో లేకపోవడం వల్ల వృద్ధురాలిని రిక్షాపై తోసుకుంటూ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఈ ఘటన ఝార్ఖండ్​లోని బొకారోలో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే...
చందన్​కియారిలోని బగన్​తోల నివాసి మారురా దేవి (75 ఏళ్లు) ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. ఆమెను చూసుకోవడానికి ఇంట్లో ఎవరూ లేరు. కొడుకు పనికి వెళ్లాడు. అనారోగ్యం కారణంగా వృద్ధురాలు చాలా నీరసించిపోయింది. తన బామ్మ అనారోగ్య పరిస్థితిని చూసిన 8 ఏళ్ల సూరజ్.. ఆమెను రిక్షాపై పడుకోబెట్టి ఆస్పత్రికి తీసుకెళ్లాడు. వయసుకు మించిన పని అని తెలిసినా.. రిక్షాను తోసుకుంటూ ఆస్పత్రికి చేరుకున్నాడు. వృద్ధురాలిని రిక్షాపై ఆస్పత్రికి తీసుకెళుతున్న వీడియో బయటకు రాగా.. ఈ విషయం అధికారుల దృష్టికి చేరింది.

"మా బామ్మ ఆరోగ్యం క్షీణించింది. దీంతో ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాను. కానీ ఆమెకు నయం కాలేదు. మాకు ఉండేందుకు ఇల్లు లేదు. మాకు ఇల్లు ఇప్పించాలి. బామ్మకు వైద్యం చేయించి ఆమెను కాపాడాలి" అని సూరజ్ వేడుకుంటున్నాడు.
కాగా, ఈ విషయంపై దర్యాప్తు చేస్తామని బొకారో చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హెచ్‌కే మిశ్ర పేర్కొన్నారు. చందన్​కియారిలో అంబులెన్స్‌ అందుబాటులో లేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసుకుంటామని చెప్పారు.

Last Updated : Dec 19, 2022, 7:30 PM IST

ABOUT THE AUTHOR

...view details