తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కర్ణాటక టు యూపీ.. రోడ్డుమార్గంలోనే రోగి షిఫ్ట్.. 2,700 కి.మీ నాన్​స్టాప్​గా.. - అంబులోన్సులో 2700 కిమీ ప్రయాణం

ఓ రోగిని కర్ణాటక నుంచి ఉత్తర్​ప్రదేశ్​కు రోడ్డుమార్గంలో తరలించారు. ఎక్కడా ఆగకుండా 2,700 కిలోమీటర్లు అంబులెన్సులో ప్రయాణించి గమ్యాన్ని చేరుకున్నారు.

2700 km ambulance journey
2700 km ambulance journey

By

Published : Sep 19, 2022, 5:23 PM IST

కర్ణాటక నుంచి ఓ రోగిని 2700 కిలోమీటర్ల దూరంలోని ఉత్తర్​ప్రదేశ్​కు అంబులెన్సులో తరలించారు. మంగళూరులో చికిత్స పొందుతున్న మహంది హసన్ అనే వ్యక్తిని యూపీలోని మొరాదాబాద్​కు రోడ్డు మార్గంలో తీసుకెళ్లారు. విశ్రాంతి, విరామం లేకుండా అంబులెన్సును పరుగులు పెట్టించారు డ్రైవర్. ఇంధనం కోసం తప్పితే ఎక్కడా అంబులెన్సును ఆపలేదని చెప్పారు.

రోగి

వివరాల్లోకి వెళ్తే
ఉత్తర్​ప్రదేశ్ మొరాదాబాద్​కు చెందిన మహంది హసన్.. కర్ణాటక మూడ్​​బిదిరి ప్రాంతంలోని మస్తికట్టలో ఉన్న ఓ గోడౌన్​లో పనిచేస్తున్నాడు. ఇటీవల ప్రమాదవశాత్తు కింద పడటం వల్ల అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనలో స్పృహ కోల్పోయిన అతడిని స్థానిక అల్వాస్ ఆస్పత్రికి తరలించారు. అయితే, కుటుంబీకులు మాత్రం అతడిని యూపీలోని మొరాదాబాద్​కు తీసుకురావాలని భావించారు. ఇందుకోసం ఆస్పత్రి వైద్యుల అనుమతి తీసుకున్నారు.

అంబులెన్సు డ్రైవర్ అశ్వథ్!

ముందుగా మంగళూరు ఎయిర్​పోర్టు నుంచి దిల్లీకి, అక్కడి నుంచి మొరాదాబాద్​కు తీసుకురావాలని ప్లాన్ వేసుకున్నారు. మూడ్​బిదిరి ప్రాంతానికి చెందిన ఐరావతా అంబులెన్సు యజమాని అనిల్ రూబన్ మెండోన్సా​ను బాధితుడి తండ్రి బబ్బూ సంప్రదించాడు. మహందిని అంబులెన్సులో మంగళూరు ఎయిర్​పోర్ట్ వరకు తీసుకురావాలని మాట్లాడుకున్నారు. సెప్టెంబర్ 9న ఎయిర్​పోర్ట్​కు బయల్దేరారు.

ఎయిర్​పోర్ట్​లో రోగి

విమానంలోకి నో ఎంట్రీ!
అయితే, అక్కడ రోగిని విమానంలో తీసుకెళ్లేందుకు ఎయిర్​లైన్ సిబ్బంది నిరాకరించారు. వైద్యులు, నర్సులు వెంటలేనిదే విమానం ఎక్కించుకోమని చెప్పారు. దీంతో చేసేదేమీ లేక అంబులెన్సు వెనుదిరిగింది. తిరిగి మూడ్​బిదిరి ఆస్పత్రిలో రోగిని చేర్పించారు. అనంతరం మహంది తండ్రి బబ్బూ.. అంబులెన్సు ఓనర్ అనిల్​కు సెప్టెంబర్ 10న ఫోన్ చేశాడు. విమానంలో రోగిని తీసుకెళ్లేందుకు అవకాశం లేనందున.. అంబులెన్సులో రోడ్డుమార్గంలోనే తీసుకెళ్లాలని కోరాడు. దీనికి అనిల్ అంగీకరించాడు. తుది ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకున్నారు. పోలీసుల అనుమతి తీసుకున్నారు.

అంబులెన్సు ఓనర్ అనిల్

అంబులెన్సును అశ్వథ్ అనే డ్రైవర్ నడిపించాడు. అనిల్ రూబన్ సైతం అంబులెన్సులో వెళ్లాడు. మహంది హసన్​తో పాటు అతడి తండ్రి, స్నేహితులు అంబులెన్సులో ప్రయాణించారు. సెప్టెంబర్ 10న మూడ్​బిదిరి నుంచి ప్రారంభమైన వీరి ప్రయాణం.. సెప్టెంబర్ 12న మొరాదాబాద్​కు చేరుకుంది. ఈ ప్రయాణంపై అంబులెన్సు ఓనర్ అనిల్ రూబన్.. ఈటీవీ భారత్​తో మాట్లాడాడు. అంబులెన్సు ప్రయాణం గురించి పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపాడు.

రోగిని అంబులెన్సులోకి ఎక్కిస్తూ...

'మీ సొంత రిస్క్​తో రోగిని తీసుకెళ్లండని వైద్యులు చెప్పారు. 2,700 కిలోమీటర్లు ప్రయాణించి రోగిని వేరే ఆస్పత్రిలో చేర్పించాం. డీజిల్ నింపుకొనేందుకు తప్ప ఎక్కడా ఆపలేదు. మధ్యలో భోజనం, స్నాక్స్ ఏదీ తీసుకోలేదు. రోగికి ప్రతి మూడు గంటలకు ఒకసారి ద్రవ ఆహారం ఇవ్వాల్సి వచ్చేది. డ్రైవర్ మధ్యమధ్యలో జ్యూస్ తాగి డ్రైవింగ్ కొనసాగించారు. వైద్యులు లేకుండా ఇంతదూరం ఎలా వచ్చారని మొరాదాబాద్​లో డాక్టర్లు ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం రోగి స్పృహలోకి వచ్చాడు. కొద్దికొద్దిగా రికవర్ అవుతున్నాడు' అని అంబులెన్సు ఓనర్ అనిల్ వివరించాడు.

అయితే, వీరి ప్రయాణం అంత సులువుగా పూర్తి కాలేదు. అంబులెన్సు మధ్యప్రదేశ్​లో ఉండగా.. రోగి పరిస్థితి కాస్త విషమించింది. వాతావరణం మారిపోవడం వల్ల శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయి. అయితే, అంబులెన్సు యజమాని అనిల్.. తనకు ఉన్న వైద్య పరిజ్ఞానంతో రోగికి ఇస్తున్న ఆక్సిజన్ మోతాదును పెంచాడు. దీంతో రోగి క్షేమంగా మొరాదాబాద్​కు చేరుకోగలిగాడు. ఆర్థిక స్తోమత లేకపోవడం వల్లే చిన్న అంబులెన్సులో తమ బంధువును తీసుకెళ్లినట్లు రోగి కుటుంబ సభ్యులు తెలిపారు. డ్రైవర్ అశ్వథ్​కు గూగుల్ మ్యాప్​లో రూట్ చూపిస్తూ సహకరించాడు అనిల్. ఇలా.. 2,700 కిలోమీటర్ల దూరం ప్రయాణించి సురక్షితంగా గమ్యాన్ని చేరుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details