రెండోదశ కరోనా ఉద్ధృతితో బిహార్లో ప్రాణవాయువుకు తీవ్ర కొరత ఏర్పడింది. ఆక్సిజన్ కోసం ఆస్పత్రిలో చేరిన ఓ కొవిడ్ రోగి.. ప్రాణవాయువు అందకుండానే చనిపోయాడు. ఆ తర్వాత.. మృతదేహానికి ఆక్సిజన్ సరఫరా అందించారు అక్కడి వైద్య సిబ్బంది.
అసలేం జరిగిందంటే?
శ్వాస సంబంధిత సమస్యతో ఇబ్బంది పడుతున్న ఓ కరోనా బాధితుడిని.. సుఫౌల్ జిల్లా, త్రివేణిగంజ్లోని కొవిడ్ కేర్ సెంటర్కు తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు. ఆ సమయంలో రోగి ఆక్సిజన్ స్థాయి 65గా ఉందని వెంటనే ప్రాణవాయువు అందించాలని అక్కడి నర్సును బంధువులు అడిగారు. కానీ, ఆక్సిజన్ పెట్టేందుకు అక్కడ వైద్యులెవరూ లేరు. ఆ తర్వాత వచ్చిన డాక్టర్.. రోగిని పరీక్షించి.. పరిస్థితి విషమంగా ఉందని, వెంటనే వేరే ఆస్పత్రికి తీసుకెళ్లాలని సలహా ఇచ్చారు. సమయానికి అంబులెన్స్ అందుబాటులో లేదు. ఈ నేపథ్యంలో తమకు అత్యవసర వాహన సౌకర్యం కల్పించాలని.. నాలుగు గంటల పాటు అధికారులను వేడుకుని విఫలయమయ్యారు బాధిత కుటుంబ సభ్యులు. చివరకు ఆక్సిజన్ అందించకముందే కొవిడ్ రోగి మృతిచెందాడు.