కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron virus).. ప్రపంచ దేశాలను వణికిస్తుంటే ఇప్పుడు భారత్‌పైనా ప్రభావం పడేలా ఉంది. ఒమిక్రాన్ తొలుత వెలుగుచూసిన ఆఫ్రికా దేశాల నుంచి ఇటీవల బిహార్‌కు వచ్చిన 281 మంది భారతీయుల్లో.. 100 మంది కనిపించకుండా పోయారు. వారిని పట్టుకోవడం ఆరోగ్య శాఖకు చాలా కష్టతరంగా మారింది. వారి వారి పాస్‌పోర్ట్‌ల్లో వెల్లడించిన చిరునామాల్లో లేకపోవడం గమనార్హం.
విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులకు కరోనా పరీక్ష తప్పనిసరి చేసింది బిహార్ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో.. ఆఫ్రికా నుంచి వారిలో చాలా మంది కనిపించకపోవడం (Passengers missing) ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు 11 మందికి మాత్రమే టెస్టులు చేయగా.. వారికి నెగెటివ్‌గా తేలినట్లు వెల్లడించారు వైద్యులు.
15 రోజుల్లో 1000 మంది..
ఆఫ్రికా దేశాల నుంచి గత 15 రోజుల్లో 1000 మంది ప్రయాణికులు మహారాష్ట్రలోని ముంబయి చేరుకున్నారు. తమకు అందిన జాబితా ప్రకారం.. 466 మంది నుంచి ఇప్పటివరకు 100 మందికిపైగా టెస్టులు చేసినట్లు బృహన్ ముంబయి మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు.
కేరళ..
వైరస్ విజృంభణ (Omicron variant in India) నేపథ్యంలో కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నడుచుకుంటామని స్పష్టం చేసింది. విదేశాల నుంచి వచ్చే వారి నమూనాలు సేకరించేందుకు రాష్ట్రంలోని నాలుగు విమానాశ్రయాల్లో ఆరోగ్య సిబ్బందిని మోహరించినట్లు పేర్కొన్నారు కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్. వారికి క్వారంటైన్ తప్పనిసరి అని వెల్లడించారు.
7 రోజులు క్వారంటైన్..
సౌతాఫ్రికా నుంచి కర్ణాటక చేరుకున్న ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ నేపథ్యంలో బెంగళూరు విమానాశ్రయ నిర్వాహకులు అప్రమత్తం అయ్యారు. కరోనా టెస్టు రిపోర్టులు ఉన్నప్పటికీ మళ్లీ పరీక్షలు నిర్వహించారు. ఎయిర్‌పోర్ట్‌ను శానిటైజ్ చేశారు.