మధ్యప్రదేశ్లోని సీధీ జిల్లా పట్నా గ్రామం వద్ద మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు.
54 మంది ప్రయాణికులతో సత్నా వెళ్తున్న బస్సు ఉదయం సుమారు 8.30 గంటల సమయంలో అదుపు తప్పి సమీపంలోని బాణసాగర్ కాలువలోకి దూసుకెళ్లింది. మొత్తం 47 మృతదేహాలను వెలికితీశారు. సహాయక చర్యలు ముగిసినట్లు ప్రకటించారు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.
క్రేన్ల సాయంతో..
ప్రమాదం జరిగిన సమయంలో అక్కడే ఉన్న పలువురు ఈ ఘటనపై స్పందిస్తూ కాలువలోకి దూసుకెళ్లిన బస్సు జాడ ఆ తర్వాత ఎక్కడా కనిపించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. బస్సు కాలువలో కొట్టుకుపోయి ఉండొచ్చని భావించారు. కానీ అధికారులు అతికష్టం మీద బస్సును గుర్తించారు. కాలువ ఎగువ నీటి ప్రవాహం అదుపు చేసిన తర్వాత బస్సు ఘటనా స్థలానికి కొంత దూరంలో ఉన్నట్లు కనుగొన్నారు. దానిని క్రేన్ల సాయంతో బయటకు తీశారు.
రాష్ట్రపతి, ప్రధాని, ఉపరాష్ట్రపతి విచారం..
ఈ విషాద ఘటనపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఈ ఘటనలో మృతులకు ప్రధాని నరేంద్ర మోదీ రూ.2 లక్షలు, తీవ్ర గాయాలపాలైన వారికి రూ.50వేలు చొప్పున పరిహారం ప్రకటించారు.