Partha Chatarjee Arpitha Mukharjee: బంగాల్‌లో పాఠశాల ఉద్యోగుల నియామకం కుంభకోణం కేసులో అరెస్టయిన తృణమూల్ కాంగ్రెస్ మాజీ మంత్రి పార్థా ఛటర్జీ, ఆయన సన్నిహితురాలు అర్పితా ముఖర్జీకి మరో 14 రోజుల పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీ పొడిగించింది. ఈడీ అభ్యర్థన మేరకు ఆగస్టు 18 వరకు కస్టడీని పొడిగిస్తూ కోల్‌కతాలోని ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. పార్థా ఛటర్జీ కోరిన బెయిల్ పిటిషన్‌ను రద్దు చేసింది.
'వైద్య పరీక్షల వల్ల రెండు రోజులు వేస్ట్'..
అంతకుమందు 15 రోజుల కస్టడీలో పార్థా ఛటర్జీకి వైద్య పరీక్షలు నిర్వహించడం వల్ల రెండు రోజులు వృథా అయ్యాయని ఈడీ అధికారులు న్యాయస్థానానికి వివరించారు. జులై 23న అరెస్టయినప్పటి నుంచి పార్థా ఛటర్జీ, అర్పితా ముఖర్జీ ఈడీ కస్టడీలోనే ఉన్నారు. ఉపాధ్యాయ నియామకాల్లో భారీ అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఆయన ఇంట్లో సోదాలు చేశారు. సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ నివాసాల్లో సైతం దాడులు నిర్వహించిన అధికారులు.. 50 కోట్లకుపైగా విలువైన డబ్బును, పెద్ద ఎత్తున బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీతో మమతా బెనర్జీ భేటీ..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. శుక్రవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తమ రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ బకాయిలతోపాటు ఇతర సమస్యలపై మోదీతో ఆమె చర్చించారు. నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యేందుకుగానూ గురువారం.. దిల్లీ చేరుకున్న మమతా బెనర్జీ.. నాలుగు రోజులపాటు రాజధానిలోనే పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నూతన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతోనూ మమతా భేటీ కానున్నారు. అయితే, అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన మంత్రి పార్థా ఛటర్జీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసిన నేపథ్యంలో ప్రధానమంత్రితో ఆ రాష్ట్ర సీఎం దీదీ సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.