కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ రైలు ప్రయాణం చేశారు. రైల్వే శాఖ మంత్రి అయిన ఆయన స్వయంగా హీరాఖంట్ ఎక్స్‌ప్రెస్‌లో ఒడిశాలోని భువనేశ్వర్ నుంచి రాయగడ వరకు ప్రయాణించారు. ఈ ప్రయాణంలో తోటి వారితో కొంత సేపు ముచ్చటించారు. అంతేగాకుండా వారి నుంచి విలువైన సలహాలు, సూచనలను అడిగి తెలుసుకున్నారు. తమ ప్రభుత్వం చేపట్టిన పలు కీలక పథకాల గురించి వారికి వివరించారు.
జన ఆశీర్వాద యాత్రలో భాగంగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో పర్యటించారు వైష్ణవ్. ఇందులో భాగంగా భువనేశ్వర్ రైల్వే స్టేషన్‌ను తనిఖీ చేశారు. అతి త్వరలోనే ఈ స్టేషన్‌ను అభివృద్ధి చేస్తామని చెప్పారు.
"భువనేశ్వర్ రైల్వే స్టేషన్‌లోని ఫ్లాట్‌ఫామ్‌లను తనిఖీ చేశాను. ప్రయాణీకులతో కూడా మాట్లాడాను. స్టేషన్ పరిశుభ్రతపై వారు హర్షం వ్యక్తం చేశారు. మరి కొన్ని వినతులు అందాయి. వాటిని పరిశీలిస్తాను. ఈ స్టేషన్ భువనేశ్వర్‌కు గుండె లాంటింది. దీనిని పరిశుభ్రంగా ఉంచుకుందాం."