మూడు రోజులుగా దేశంలో కరోనా కేసుల సంఖ్య రెండు లక్షలకు పైగా నమోదవుతూ వస్తోంది. రోజుకు వెయ్యి మందికి పైగా మరణిస్తున్నారు. పరిస్థితి ఎంత తీవ్రంగా మారిందనేందుకు ఈ గణాంకాలే ఓ ఉదహరణ. కేంద్ర ఆరోగ్య శాఖ వివరాల ప్రకారం ఒక్కరోజే.. 2,61,500 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఎన్నడూ లేనంతగా 1501 మంది కరోనాకు బలయ్యారు. అయితే, ప్రభుత్వం విడుదల చేస్తున్న ఈ వివరాలకు.. శ్మశానంలో అంత్యక్రియలు జరుగుతున్న మృతదేహాలకు పొంతనలేకుండా పోయింది. దీనిపై ఈటీవీ భారత్ చేపట్టిన రియాలిటీ చెక్‌లో గణాంకాల మధ్య తీవ్రమైన అవకతవకలు బయటపడ్డాయి.
మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, దిల్లీలో క్షేత్రస్థాయి పరిస్థితిని.. 'కరోనా మరణాలను ప్రభుత్వాలు దాస్తున్నాయా?'శీర్షికతో ఈటీవీ భారత్ ఇప్పటికే మీ ముందుంచింది. దేశంలో కరోనా కేసులు అధికంగా ఉన్న మహారాష్ట్ర సహా గుజరాత్లో గణాంకాల మధ్య పొంతన లేకపోవడాన్ని ఇప్పుడు వెలుగులోకి తెచ్చింది. పలు శ్మశానవాటికల నుంచి సేకరించిన గణాంకాలు, ప్రభుత్వం వెల్లడిస్తున్న వివరాల మధ్య సారూప్యత లేకపోవడాన్ని ఇది స్పష్టం చేస్తోంది.
మహారాష్ట్ర
దేశంలో కరోనా వ్యాప్తి రెండు దశల్లో మహారాష్ట్ర తీవ్రంగా ప్రభావితమైంది. ఇప్పుడు సగటున 60 వేల కేసులు రోజూ వెలుగులోకి వస్తున్నాయి. శనివారం 67,123 మందికి కరోనా సోకిందని రాష్ట్ర ప్రభుత్వం నిర్ధరించింది. 419 మంది మరణించారు.
ఈటీవీ భారత్ పరిశీలనలో భాగంగా.. ఏప్రిల్ 9న విడుదల చేసిన గణాంకాల్లో లోపాలను గుర్తించింది. అహ్మద్ నగర్‌లోని అమర్‌ధామ్ శ్మశానవాటికలో ఆ రోజు 49 మృతదేహాలకు అంత్యక్రియలు చేశారు. ప్రభుత్వ గణాంకాలు మాత్రం.. జిల్లాలో ముగ్గురే చనిపోయారని చెబుతున్నాయి. ఆ రోజు రాష్ట్రవ్యాప్తంగా 301 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
ఇవి అహ్మద్‌నగర్‌లోని ఒక్క శ్మశానవాటికకు సంబంధించిన వివరాలే. ఈ జిల్లాలో ఎన్నో శ్మశానవాటికలు ఉన్నాయి. ఇక మహారాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శ్మశానవాటికల్లో ఎన్ని మృతదేహాలకు అంత్యక్రియలు జరుగుతున్నాయి? అందులో ఎంత మంది కరోనా బాధితులు ఉండొచ్చనే విషయంపై ఆందోళన నెలకొంది.
గుజరాత్
గుజరాత్‌లోనూ కరోనా కేసుల సంఖ్య గత రెండు వారాల నుంచి క్రమంగా పెరుగుతోంది. కొత్తగా 9,541మందికి వైరస్ నిర్ధరణ అయింది. మరో 97 మంది బలయ్యారు.