మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లోని శారదా బల్‌గ్రామ్ అటవీ ప్రాంతం. అక్కడికి సమీపంలోనే ఓ పాఠశాలలో చదువుకోవడానికి అనేక మంది విద్యార్థులు ఉదయం వస్తారు. సాయంత్రం బడి ముగియగానే తిరిగి వెళ్తుంటారు. ఒక చిలుక కూడా వారిని అనుసరిస్తూ చూపరులను ఆకట్టుకుంటోంది.
పిల్లలను బడిలో వదిలి వెళ్లేందుకు తల్లిదండ్రులు వచ్చి వెళ్లినట్లు రోజూ ఉదయం విద్యార్థుల వెంట ఆ చిలుక (Gwalior school Parrot) కూడా పాఠశాలకు వస్తుంది. వారు బడిలోకి వెళ్లగానే సమీపంలోని కొండల్లోకి ఎగిరిపోతుంది. సాయంత్రం బడి గంట మోగగానే మళ్లీ వస్తుంది.
వారి భుజాలపైనా, తలపైనా కూర్చుని ఆడుతూ హాస్టల్‌కు వెళ్తుంది. వారితో కలిసి తింటుంది, ఆడుకుంటుంది. చాలా రోజుల నుంచి చిలుక దినచర్య ఇదేనని అక్కడి పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు చెబుతున్నారు.
"చిలుక రావడం వల్ల మాకు ఎంతో బాగా అనిపిస్తుంది. మాతో పాటు పాఠశాలకు వస్తుంది. సెలవు ఉంటే మాతోనే ఉంటుంది. పాఠశాల ముగియగానే సాయంత్రం వచ్చి మాతో ఆడుకుంటుంది. ఆ తర్వాత వెళ్లిపోతుంది."