పార్లమెంటు స్థాయీ సంఘాల సమావేశాలు వర్చువల్ విధానంలో నిర్వహించడం ప్రస్తుతం సాధ్యం కాదని రాజ్యసభ సచివాలయం తెలిపింది. ఈ తరహా సమావేశాలు జరపాలంటే నిబంధనలను సడలించాల్సి ఉంటుందని పేర్కొంది. పార్లమెంటు సమావేశాలు ప్రస్తుతం లేకపోవడం వల్ల నిబంధనల సవరణ వీలు కాదని తెలిపింది.
సమావేశాలు రహస్యంగా జరగాలన్న నిబంధన ఉన్నందున దానిని తగిన విధంగా మార్చాల్సి ఉంటుంది. ఈ మేరకు ఎగువసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాసింది. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో మౌనంగా ఉండలేమని, అందువల్ల వర్చువల్ విధానంలో స్థాయీ సంఘాల సమావేశాలు జరపాలని కోరుతూ ఖర్గే ఇటీవల రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడుకు లేఖ రాశారు.