oxygen shortage during covid: దేశంలో కొవిడ్ రెండో ఉద్ధృతి తీవ్రంగా నెలకొన్న సమయంలో ఆక్సిజన్ కొరత కారణంగా అసలు మరణాలే చోటుచేసుకోలేదని... కేంద్ర ఆరోగ్యశాఖ చెప్పడం తీవ్రంగా కలచివేసిందని పార్లమెంటరీ స్థాయీ సంఘం పేర్కొంది. దేశంలో ప్రాణ వాయువుకు, ఆక్సిజన్ సిలిండర్లకు కొరత లేదన్న ప్రభుత్వ వ్యాఖ్యల్లో డొల్లతనం నాడు బహిర్గతమైందని పేర్కొంది. ఆక్సిజన్ అందుబాటులో లేదన్న కారణంతో తమ వద్ద ఒక్క కొవిడ్ మరణం కూడా నమోదు కాలేదని 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కేంద్ర ప్రభుత్వానికి నివేదించడం పట్ల విస్మయం వ్యక్తం చేసింది. ఇకనైనా, రాష్ట్రాల సహకారంతో ఈ చావులను నమోదు చేయాలని, వైద్య సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు సరైన వ్యూహాలను రూపొందించుకోవాలని కేంద్రానికి సూచించింది. 'వ్యాక్సిన్ అభివృద్ధి, పంపిణీ, కొవిడ్ మహమ్మారి నిర్వహణ' పేరుతో రాజ్యసభకు సమర్పించిన నివేదికలో స్థాయీ సంఘం ఈ వ్యాఖ్యలు చేసింది.
మీడియా కళ్లకు కట్టింది...
"కొవిడ్ ఉద్ధృతి వేళ ఆక్సిజన్ లభించక ఎంతోమంది చనిపోయినా, ఆ వాస్తవాల పట్ల ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ప్రభుత్వానికి అసలు సానుభూతే లేదని దీంతో అర్థమైంది. ఆక్సిజన్‌ను రాష్ట్రాలకు పంపిణీ చేయడంలోనూ కేంద్రం విఫలమైంది. ప్రాణవాయువును నిలకడగా సరఫరా చేయలేకపోయింది. ఆక్సిజన్, వెంటిలేటర్లతో కూడిన పడకలను అందుబాటులో ఉంచలేకపోయింది. ఆ సమయంలో నెలకొన్న అత్యంత దయనీయ పరిస్థితులను... ఆక్సిజన్ సిలిండర్లు, ఔషధాల కోసం ప్రజలు బారులుతీరి నిరీక్షించడాన్ని మీడియా తన కథనాల్లో కళ్లకు కట్టింది. ఆక్సిజన్ కొరత కారణంగా చోటుచేసుకున్న మరణాలను నమోదు చేసేందుకు అసలు మార్గదర్శకాలే లేవు. దీంతో 'అనుబంధ ఆరోగ్య సమస్యలు (కో-మార్బిడిటీస్)' పేరుతో వీటిని లెక్కిస్తున్నారు. ఈ మరణాలపై రాష్ట్రాల సహకారంతో కేంద్రం ఆడిట్ నిర్వహించాలి. ప్రభుత్వ సంస్థల నుంచి మరింత పారదర్శకతనూ, జవాబుదారీతనాన్నీ ఆశిస్తున్నాం" అని కమిటీ పేర్కొంది.