All Party Meeting Today: పెగసస్ వ్యవహారం, ధరల పెరుగుదల, నిరుద్యోగమే ప్రధాన అస్త్రాలుగా పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కేంద్రాన్ని ఇరుకునపెట్టేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. పార్లమెంటు ఆవరణలో ఆదివారం జరిగిన అఖిలపక్ష భేటీలో ఈమేరకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చాయి. సోమవారం నుంచి జరిగే శీతాకాల సమావేశాల్లో ఆయా అంశాలను చర్చకు చేపట్టాలని డిమాండ్ చేశాయి.
బంగాల్తోపాటు ఇతర రాష్ట్రాల్లో సరిహద్దు భద్రత దళం(బీఎస్‌ఎఫ్) అధికార పరిధిని విస్తృతం చేయడంపైనా ప్రతిపక్షాలు ప్రశ్నలు లేవనెత్తినట్లు అధికారవర్గాలు తెలిపాయి.
"ద్రవ్యోల్బణం, ఇంధన ధరలు పెరుగుదల, రైతు సమస్యలు, కొవిడ్-19.. తదితర అంశాలపై ప్రశ్నలను అఖిలపక్ష సమావేశంలో కేంద్రంపై సంధించాం. కనీస మద్దతు ధరపై చట్టం తీసుకురావాలని అన్నిపార్టీలు డిమాండ్ చేశాయి. కొవిడ్-19 బాధిత కుటుంబాలకు రూ. 4లక్షల పరిహారం ఇవ్వాలని, రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతులకు పరిహారం అందించాలని మేము డిమాండ్ చేశాం.ఈ సమావేశానికి ప్రధాని మోదీ హాజరవుతారని భావించాం. కానీ హాజరుకాలేదు. కేంద్రం రైతు చట్టాలను రద్దు చేసింది.. రైతులకు అర్థమయ్యేలా వివరించడంలో విఫలమయ్యామని ప్రధాని మోదీ అన్నారు. అంటే దీని అర్థం.. భవిష్యత్తులో మరో విధంగా రైతు చట్టాలను తీసుకురావచ్చు."
-- మల్లికార్జున ఖర్గే, రాజ్యసభ ప్రతిపక్ష నేత
కనీస మద్దతు ధర(ఎమ్ఎస్పీ)పై చట్టాలు చేయడం, లాభదాయక ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ.. తదితర అంశాలను తృణమూల్ కాంగ్రెస్ నేతలు సుదీప్ బందోపాధ్యాయ, దెరెఖ్ ఓబ్రియన్ లేవనెత్తినట్లు సమాచారం.