Parliament winter session: లఖింపుర్ ఖేరి హింసాత్మక ఘటనపై గురువారం పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి. ప్రతిపక్షాల ఆందోళనలతో ఉభయ సభల్లో వాయిదాల పర్వ కొనసాగింది. ఎలాంటి కార్యకలాపాలు జరగకుండానే శుక్రవారానికి వాయిదా పడ్డాయి.
లోక్‌సభలో..
Lok Sabha adjourned today: లోక్‌సభ ప్రారంభమయిన తర్వాత.. తమిళనాడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్‌కు నివాళులర్పించారు సభ్యులు. కొద్ది క్షణాల పాటు మౌనం పాటించి సంఘీభావం తెలిపారు. ఆ తర్వాత లఖింపుర్ ఖేరి ఘటన ఉద్దేశపూర్వకంగానే జరిగిందని ప్రత్యేక దర్యాప్తు బృందం ఇచ్చిన నివేదికను ప్రస్తావిస్తూ.. లోక్‌సభలో విపక్షాలు ఆందోళనకు దిగాయి. తృణమూల్ కాంగ్రెస్ సహా విపక్ష నేతలు స్పీకర్ వెల్‌లోకి దూసుకెళ్లారు.
విపక్షాల నినాదాల మధ్యే ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు స్పీకర్ ఓంబిర్లా. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వగా.. అజయ్ మిశ్రాను మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఆయన ఓ నేరస్థుడని, లఖింపుర్ ఘటనతో ఆయనకు సంబంధం ఉందని రాహుల్ ఆరోపించారు. అయితే, ఎంఎస్ఎంఈ రంగానికి సంబంధించి అడిగిన ప్రశ్నకే పరిమితం కావాలని రాహుల్‌కు స్పీకర్ సూచించారు. కానీ, రాహుల్ తన డిమాండ్‌ను కొనసాగించటం.. సభలో గందరగోళానికి దారి తీసింది. విపక్షాల నినాదాలతో కార్యకలాపాలను మొదట మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు స్పీకర్.
తిరిగి సభ ప్రారంభమైన తర్వాత కూడా విపక్ష సభ్యులు ఆందోళనలు కొనసాగించారు. లఖింపుర్ ఖేరి ఘటన, సిట్ నివేదికపై చర్చ చేపట్టాలని, కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలతో హోరెత్తించారు. దాంతో సభాకార్యకలాపాలు కొనసాగే పరిస్థితులు కనిపించక.. శుక్రవారం ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు.
రాజ్యసభలో..
Rajya Sabha adjourned: రాజ్యసభ ప్రారంభమైన వెంటనే.. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా రాజీనామాకు డిమాండ్ చేస్తూ విపక్ష ఎంపీలు ఆందోళనలు చేపట్టారు. ఆయన కుమారుడు ఆశిష్ మిశ్రా ఈ ఘటనలో నిందితునిగా ఉన్న నేపథ్యంలో మంత్రిగా కొనసాగే అర్హత అజయ్ మిశ్రాకు లేదని ఆరోపించారు. నినాదాలతో కార్యకలాపాలకు అంతరాయం కలుగుతుండటం వల్ల మొదట సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్ వెంకయ్య నాయుడు ప్రకటించారు.