Parliament Winter Session: శీతాకాల సమావేశాల్లో భాగంగా రెండో రోజు సమావేశమైన పార్లమెంట్ ఉభయసభల్లో విపక్షాలు ఆందోళనలు కొనసాగించాయి. 12 మంది సభ్యులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని పెద్ద ఎత్తన నినాదాలు చేశాయి. దీంతో లోక్సభ, రాజ్యసభలో మంగళవారం కూడా వాయిదాల పర్వం కొనసాగింది. ఎలాంటి చర్చ లేకుండానే రెండు సభలు బుధవారం ఉదయం 11 గంటలకు వాయిదా పడ్డాయి.
మంగళవారం ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభంకాగానే విపక్ష సభ్యులు నిరసనకు దిగారు. రాజ్యసభలో సస్పెండ్ అయిన సభ్యులకు మద్దతుగా నినాదాలు చేశారు. కాసేపటికే సభ నుంచి వాకౌట్ చేశారు. దీంతో సభను మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు స్పీకర్ ఓంబిర్లా. సభ తరిగి ప్రారంభమైనా.. విపక్షాలు ఆందోళనలు విరమించలేదు. దీంతో మరోసారి మధ్యాహ్నం 3గంటల వరకు సభ వాయిదా పడింది. అనంతరం మళ్లీ ప్రారంభమైనా పరిస్థితిలో మార్పు లేదు. స్పీకర్ పదే పదే చెప్పినా విపక్ష సభ్యులు నినాదాలు ఆపలేదు. దీంతో స్పీకర్ బుధవారం ఉదయం 11 గంటలకు సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
విపక్షాలకు స్పీకర్ పిలుపు..
Lok Sabha live: విపక్షాలు తరచూ ఆందోళనకు దిగుతున్న నేపథ్యంలో అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో స్పీకర్ ఓం బిర్లా సమావేశమయ్యారు. నిరసనలు ఆపి సభా కార్యకాలాపాలు సజావుగా సాగేందుకు సహకరించాలని వారికి సూచించారు. సభ విరామ సమయంలో ఈ భేటీ జరిగింది.
వెనక్కి తగ్గని వెంకయ్య..
Rajya Sabha Live: ఉదయం 11 గంటలకు రాజ్యసభ ప్రారంభమైన వెంటనే 12 మంది సభ్యులపై సస్పెన్షన్ వేటు ఉపసంహరించుకోవాలని ఛైర్మన్ వెంకయ్య నాయుడును ప్రతిపక్షనేత మల్లికార్జున్ ఖర్గే విజ్ఞప్తి చేశారు. గత సెషనల్లో జరిగిన విషయాలకు వారిని ఇప్పుడు బహిష్కరించడం సరికాదని, వారి సస్పెన్షన్ సభా నిబంధనలకు విరుద్ధమన్నారు. ఛైర్మన్ వెంకయ్యనాయుడు మాత్రం తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. సభ్యులపై సస్పెన్షన్ను ఎత్తివేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. గత సెషన్లో ఆ సభ్యులు చేసిన విధ్వంసం సభా మర్యాదలను మసకబార్చిందని, అలాంటి వారిని బహిష్కరించడం న్యాయమే అని పేర్కొన్నారు. సభ్యులను సస్పెండ్ చేసే అధికారం ఛైర్మన్గా తనకు ఉందని స్పష్టం చేశారు. దీంతో విపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.
అనంతరం పార్లమెంట్ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఉభయసభల ఎంపీలు నిరసనకు దిగారు. తమను సస్పెండ్ చేయడం అప్రజాస్వామికం అని ఆరోపించారు. నిర్ణయాన్ని ఛైర్మన్ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తాము చేసింది తప్పేం కాదని, ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమాపణలు చెప్పబోమని స్పష్టం చేశారు. ఆ తర్వాత మంగళవారం రెండోసారి విపక్ష నేతలు సమావేశమయ్యారు. ప్రతిపక్షనేత మల్లికార్జున్ ఖర్గే కార్యాలయంలో ఈ భేటీ జరిగింది.
మధ్యాహ్నం 2 గంటలకు రాజ్యసభ తిరిగి ప్రారంభమైనా విపక్ష సభ్యులు సభలోకి రాలేదు. దీంతో సభ బుధవారం ఉదయం 11 గంటల వరకు వాయిదాపడింది.
రాజ్యసభలో మంగళవారం ఆనకట్ట భద్రత బిల్లు, 2019పై చర్చ జరపాలనుకున్నామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. విపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేయడం వల్ల చర్చ జరగలేదని, ఒకవేళ వారు బుధవారం సభకు హాజరైతే ఈ బిల్లుపై చర్చిస్తామని చెప్పారు.