రాజ్యసభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. పెద్దల సభ ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడింది. ఉదయం 11గంటలకు ప్రారంభమైన సభ.. విపక్షాల నిరసనలతో కొద్దిసేపటికే వాయిదా పడింది. తర్వాత 12గంటలకు తిరిగి ప్రారంభమైనప్పటికీ, ద్రవ్యోల్బణం, రైతు సమస్యలు వంటి అంశాలపై విపక్షాలు నిరసన చేశాయి. చర్చకు పట్టుబట్టాయి. ఇది ప్రశ్నోత్తరాల సమయమని, చర్చ జరగదని డిప్యూటీ స్పీకర్ చెప్పడం వల్ల విపక్షాలు వాకౌట్ చేశారు. ఆ తర్వాత సభ రెండోసారి వాయిదా పడింది. తిరిగి 2గంటలకు కార్యకలాపాలు జరగనున్నాయి.
Parliament winter session: రాజ్యసభ నుంచి కాంగ్రెస్ సభ్యుల వాకౌట్ - parliament winter session live
13:25 December 02
విపక్షాల వాకౌట్.. రాజ్యసభ వాయిదా..
12:28 December 02
రాజ్యసభలో ద్రవోల్భణంపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. కానీ డిప్యూటీ ఛైర్మన్ అందుకు నిరాకరించడం వల్ల కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ఎన్సీపీ, ఆర్జేడీ, టీఆర్ఎస్, ఐయూఎంఎల్ నేతలు కూడా నిరసనగా సభను వీడారు.
12:15 December 02
విపక్షాల నిరసన మధ్య రాజ్యసభ
దాదాపు గంట పాటు వాయిదా పడిన రాజ్యసభ.. 12గంటలకు తిరిగి ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ద్రవ్యోల్బణం, రైతుల సమస్యలపై చర్చకు పట్టుబట్టాయి విపక్షాలు. సభలో ప్రశ్నోత్తరాల సమయం నడుస్తోంది.. చర్చ జరగదని డిప్యూటీ స్పీకర్ తేల్చిచెప్పారు. ఫలితంగా విపక్ష నేతలు తీవ్రస్థాయిలో నినాదాలు చేశారు.
11:14 December 02
రాజ్యసభ వాయిదా
రాజ్యసభలో నాలుగో రోజూ.. వాయిదాల పర్వం కొనసాగుతోంది. సభ మొదలైన కొద్ది సేపటికే.. 12గంటల వరకు వాయిదా పడింది. విపక్షాల నిరసనలే ఇందకు కారణం.
10:54 December 02
విపక్షాల నిరసన...
12మంది ఎంపీల సస్పెన్షన్పై పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ఎందుట.. విపక్షాలు నిరసన కొనసాగిస్తున్నాయి. నల్ల బ్యాండ్లు ధరించి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు పలువురు ఎంపీలు.
మరోవైపు భాజపా ఎంపీలతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. గురువారం.. పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.
10:31 December 02
సభలు సజావుగా సాగేనా?
Parliament winter session: పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు నేడు నాలుగో రోజు. 12మంది రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్ను ఎత్తివేయాలని 3 రోజులుగా నిరసనలు చేస్తున్నాయి విపక్షాలు. ఈ నేపథ్యంలో రాజ్యసభ నేటికి వాయిదా పడింది.
బుధవారం లోక్‌సభలో మాత్రం రాత్రి 7:30 గంటల వరకు కార్యకలాపాలు సాగాయి. ఈ క్రమంలో సంతాన సాఫల్య కేంద్రాలను నియంత్రించేందుకు ఉద్దేశించిన అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. పార్లమెంటరీ స్థాయి సంఘం సిఫార్సుల ఆధారంగా చేసిన సవరణలతో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టారు. అనంతరం.. మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందింది. సంతాన సాఫల్య కేంద్రాలపై నియంత్రణ, పర్యవేక్షణ కోసం కేంద్రం ఈ బిల్లును తీసుకువచ్చింది.
నాలుగో రోజైన గురువారం.. జాతీయ ఫార్మా విద్య, పరిశోధన చట్ట సవరణ బిల్లు లోక్‌సభ ముందుకు రానుంది. డ్యామ్ సేఫ్టీ బిల్లు, 2019పై పెద్దల సభలో చర్చ జరగాల్సి ఉంది.
మరోవైపు.. దేశంలో కరోనా పరిస్థితులపై దిగువ సభలో గురువారం చర్చ జరగనుంది.