Parliament Winter Session 2023 Modi Speech :ఓటమి తాలూకు అసహనాన్ని పార్లమెంట్‌లో ప్రదర్శించొద్దని కాంగ్రెస్కు హితవు పలికారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు పార్లమెంట్ ఆవరణలో మాట్లాడిన ఆయన, ఆదివారం వెలువడిన నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. సభ సజావుగా సాగేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ వేదికగా ప్రతిపక్షాలు దేశానికి సానుకూల సందేశాన్ని అందిస్తే అది వారికి కూడా ప్రయోజనకరమని సూచించారు. కొత్త పార్లమెంటు వ్యవస్థలో ఏమైనా లోటుపాట్లు ఉండవచ్చన్న ప్రధాని మోదీ, వాటికి సూచనలు చేస్తే తప్పకుండా మార్పులు చేయాల్సి వస్తుందని పేర్కొన్నారు.
"ఈసారి శీతాకాలం కాస్త ఆలస్యమైంది. కానీ, రాజకీయ వేడి మాత్రం విపరీతంగా పెరిగింది. ఆదివారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సంతృప్తినిచ్చాయి. సుపరిపాలన, జనహితం కోసం పాటుపడిన వారికి ప్రజలు పట్టం కట్టారు. మహిళ, యువత, రైతులు, పేదలే ప్రధాన కులాలని నమ్మి, వారి సాధికారిత కోసం పనిచేస్తున్న వారికే ప్రజలు మద్దతు తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం నిబద్ధతతో పనిచేస్తే ప్రభుత్వ వ్యతిరేకత అనే పదం ఉండదని రుజువైంది. నెగెటివిటీని ఈ దేశం తిరస్కరించింది.
ఈ ఫలితాలను చూసిన తర్వాత ప్రతిపక్ష సభ్యులకు నేను ఓ విషయం చెప్పాలనుకుంటున్నా. ఇది వారికి సువర్ణావకాశం. ఈ ఓటమిపై విసుగు చెంది ఆ నిరాశను పార్లమెంట్‌లో చూపించాలనుకునే ఆలోచనలు మానుకోవాలి. గత 9 ఏళ్లుగా వారికి అలవాటుగా మారిన నెగెటివిటీని పక్కనబెట్టి ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవాలి. సానుకూల దృక్పథంతో ముందుకు సాగితే ఈ దేశం కూడా వారిపై ఉన్న అభిప్రాయాన్ని మార్చుకుంటుంది. వారు ప్రతిపక్షంలో ఉన్నా సరే వారికో సలహా ఇస్తున్నా. ప్రతి ఒక్కరి భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. నమ్మకాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు."
-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి