02.55 PM
ఆమ్ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాపై విధించిన సస్పెన్షన్‌ను రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ ఎత్తివేశారు. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత రాఘవ్ చద్దా సస్పెన్షన్‌ను రద్దు చేస్తున్నట్లు ధన్‌ఖడ్ ప్రకటించారు. దీంతో ధనఖడ్కు రాఘవ్ చద్దా ధన్యవాదాలు తెలిపారు. "సుప్రీంకోర్టు జోక్యంతో నాపై విధించిన సస్పెన్షన్‌ను రద్దు అయింది. నన్ను 115 రోజుల పాటు సస్పెండ్ చేశారు. ఆ సమయంలో ప్రజల గొంతును సభలో వినిపించలేకపోయాను. సుప్రీంకోర్టుతోపాటు రాజ్యసభ ఛైర్మన్‌కు ధన్యావాదాలు తెలియజేస్తున్నాను" అని వీడియో సందేశంలో చెప్పారు.
2.10PM
వాయిదా అనంతరం పార్లమెంట్ ఉభయసభలు తిరిగి సమావేశమయ్యాయి.
1.13 PM
పార్లమెంట్ ఉభయ సభలు మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడ్డాయి.
12.40PM
రాజ్యసభలో క్వశ్చన్ అవర్ కొనసాగుతోంది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రులు సమాధానాలు ఇస్తున్నారు. లోక్‌సభలో కీలక ప్రజాసంబంధిత అంశాలపై చర్చ జరుగుతోంది.
12.00PM
విపక్షాల నినాదాల మధ్య రాజ్యసభ కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఉపసభాపతి అనుమతితో సభ్యులు వివిధ అంశాలపై మాట్లాడుతున్నారు. వాయిదా అనంతరం లోక్‌సభ తిరిగి సమావేశమైంది.
11.15 AM
ప్రారంభమైన కొద్దిసేపటికే లోక్‌సభ వాయిదా పడింది. సభ్యుల గందరగోళం సృష్టించడం వల్ల మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా. మరోవైపు రాజ్యసభ కొనసాగుతోంది.
11.00 AM
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై వేటు వేసేందుకు కేంద్రం సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. కొత్త క్రిమినల్ చట్టాలపైనా సమావేశాల్లో చర్చ జరిగే అవకాశం ఉంది.
10.40 AM
సుపరిపాలన, జనహితం కోసం పాటుపడిన వారికి ప్రజలు పట్టం కట్టారన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. సోమవారం పార్లమెంట్ శీతాకాల సమావేశల ప్రారంభం నేపథ్యంలో ఆయన పార్లమెంట్ ఆవరణలో మాట్లాడారు. "ఆదివారం నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ప్రభుత్వ పథకాలను పూర్తి స్థాయిలో పేదలకు అందించిన వారికే ప్రజల పట్టం కట్టారు. కొత్త పార్లమెంటులో సుదీర్ఘ కాలం కార్యకలాపాలు జరుగుతాయి. కొత్త పార్లమెంటు వ్యవస్థలో ఏమైనా లోటుపాట్లు ఉండి ఉంటాయి. కార్యకలాపాలు సాగినపుడు సందర్శకులు లోటుపాట్లపై సూచనలు చేస్తారు. లోటుపాట్లపై సూచనలు చేస్తే తప్పకుండా మార్పులు చేయాల్సి వస్తుంది." అని చెప్పారు.
Parliament Winter Session 2023 Live Updates :పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు రంగం సిద్ధమైంది. సోమవారం నుంచి డిసెంబరు 22 వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. డబ్బులు తీసుకుని లోక్‌సభలో ప్రశ్నలు అడిగారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్నా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాపై వేటు వేసేందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలుస్తోంది. మహువా బహిష్కరణను సిఫార్సు చేసే నివేదికను లోక్‌సభ నైతిక కమిటీ లోక్‌సభలో ప్రవేశపెట్టనుందని సమాచారం. కొత్త క్రిమినల్ చట్టాలపై శీతాకాల సమావేశాల్లో చర్చించే అవకాశం ఉంది.
వీటితోపాటు పెండింగ్‌లో ఉన్న ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామకాలకు సంబంధించిన బిల్లులు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. అధికార భాజపాను ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష ఇండియా కూటమి నాయకులు సోమవారం ప్రత్యక్ష సమావేశం కానున్నారు. ప్రతిపక్షాలు పార్లమెంటుకు అంతరాయం కలిగిస్తే ఆదివారం వచ్చిన దానికంటే దారుణమైన ఫలితాలు ఎదుర్కోవలసి వస్తుందని ప్రహ్లాద్ జోషి అన్నారు. ఏ అంశంపైన అయిన చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని అయితే స్వల్పకాలిక చర్చ కోరినప్పుడు సభకు అంతరాయం కలిగించరాదని కోరారు.