Opposition Leaders Protest: సస్పెన్షన్లకు నిరసనగా 20 మంది రాజ్యసభ సభ్యులు పార్లమెంటు ఆవరణలోనే 50 గంటల రిలే దీక్షకు దిగారు. రాత్రుళ్లు కూడా అక్కడి నుంచి కదలలేదు. వారికి అవసరమైన ఆహారం, ఇతర ఏర్పాట్లను ప్రతిపక్షాలు చూశాయి. 50 గంటలపాటు ఇలానే ఆందోళన కొనసాగిస్తామని తృణమూల్ ఎంపీ డోలాసేన్ స్పష్టం చేశారు. ఎన్సీపీ, జేఎంఎంల నుంచి ఎవరూ సస్పెండ్ కాకపోయినా ఆ రెండు పార్టీలు కూడా నిరసనలో పాల్గొన్నాయి. నిరసన శిబిరంలో ఉన్నవారికోసం ఉదయం ఇడ్లీ-సాంబార్‌ను డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ సమకూర్చగా మధ్యాహ్నం పెరుగన్నాన్ని అదే పార్టీ ఏర్పాటు చేసింది. రాత్రికి రోటీ, పన్నీర్, చికెన్ తండూరీని తృణమూల్ సమకూర్చింది. గురువారం అల్పాహారాన్ని డీఎంకే, మధ్యాహ్న భోజనాన్ని తెరాస, రాత్రి భోజనాన్ని ఆప్ పంపిస్తాయి. నిరసనలో కూర్చున్నవారికి మద్దతుగా వంతుల వారీగా కొంతమంది విపక్ష సభ్యులు శిబిరం వద్దకు వచ్చేలా ప్రణాళిక రూపొందించారు. దీనికోసం వాట్సప్ గ్రూపు ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ టెంట్ వేయడానికి పార్లమెంటు వర్గాలు అనుమతించలేదు. ఆరుబయటే వారంతా విశ్రమించారు.
విపక్షాలకు చెందిన కొంతమంది సభ్యుల సస్పెన్షన్‌పై బుధవారం.. పార్లమెంటు ఉభయసభల కార్యకలాపాల్లో ప్రతిష్టంభన నెలకొంది. అనుచిత ప్రవర్తనకు గానూ విచారం వ్యక్తం చేసినట్లయితే సస్పెన్షన్ ఎత్తివేతను పరిశీలిస్తామని ప్రభుత్వం తెలిపింది. సోమవారం లోక్‌సభలో నలుగురు, మంగళవారం రాజ్యసభలో 19 మంది సభ్యులు సస్పెండ్ కాగా బుధవారం రాజ్యసభలో ఆప్ సభ్యుడు సంజయ్‌సింగ్‌పైనా వేటు పడింది. ఎంపీల సస్పెన్షన్‌ను తక్షణమే ఎత్తివేయాలంటూ విపక్షాలు డిమాండ్ చేశాయి. తాము అడిగే ప్రశ్నలకు భయపడే ప్రభుత్వం ఇలా సస్పెన్షన్లు చేయిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు.
వెల్‌లో బైఠాయించి నినాదాలు:ధరల పెరుగుదలపై చర్చించాలని ఆప్ సహా విపక్ష నేతలంతా రాజ్యసభలో వెల్ వద్ద బైఠాయించి నినాదాలిచ్చారు. భోజన విరామ సమయానికి ముందే మూడుసార్లు సభ వాయిదా పడింది. 267 నిబంధన కింద చర్చ కోసం సభను వాయిదా వేయాల్సిన అవసరం లేదని ఛైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు చెప్పారు. తనను మాట్లాడనీయకుండా అడ్డుపడుతున్న సంజయ్‌సింగ్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు. కూర్చోకపోతే సభ నుంచి బయటకు పంపాల్సి వస్తుందని చెప్పారు. విరామం తర్వాత సభ సమావేశమైనప్పుడు సంజయ్‌సింగ్ ఈ వారాంతం వరకు సస్పెండయ్యారు. సభను వీడి వెళ్లాల్సిందిగా సభాధ్యక్ష స్థానంలో ఉన్న భువనేశ్వర్ కాలితా ఆయన్ని ఆదేశించారు. మిగతా సభ్యుల్ని తమతమ స్థానాల్లోకి వెళ్లాల్సిందిగా ఆయన సూచించినా వారు వెనక్కి తగ్గలేదు. దీంతో సభను గురువారానికి వాయిదా వేశారు.