Parliament Suspended MPs Reactions : పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేయడం పట్ల బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు విపక్ష ఇండియా కూటమికి చెందిన ఎంపీలు. పార్లమెంట్‌ను రాజ్యాంగాన్ని సమాధి చేసే శ్మశానంగా, ఉత్తర కొరియా అసెంబ్లీగా అభివర్ణించారు. భద్రతా ఉల్లంఘన అంశాన్ని చర్చించకపోవడం బాధాకరమని, ఎంపీలను కాపాడడానికి బదులుగా వాళ్లను సస్పెండ్ చేస్తున్నారని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దుయ్యబట్టారు. ప్రతిపక్షంలేని లోక్‌సభను సృష్టిండమే ప్రభుత్వ ధ్యేయంగా కనిపిస్తోందని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ధ్వజమెత్తారు. పార్లమెంట్లో ప్రజాస్వామ్య వ్యవస్థ సక్రమంగా పనిచేయాలన్న కోరిక వారిలో లేదని మండిపడ్డారు.
"నా 15 ఏళ్ల పార్లమెంట్ కెరీర్‌లో భద్రతా వైఫల్యంపై చర్చించాలని మొదటిసారి వెల్‌లోకి దూసుకెళ్లి ప్లకార్డులు ప్రదర్శించాను. ఆ ఘటనపై వివరణ కోరిన సస్పెండ్ అయిన కాంగ్రెస్ మిత్రులకు సంఘీభావంగా నేనలా చేశాను."
-శశిథరూర్,కాంగ్రెస్ ఎంపీ
"నాకు మాట్లాడానికి మాటలు రావడం లేదు. కొత్త పార్లమెంట్ కట్టేముందు వారు ఏం ఆలోచించారు? ప్రజస్వామ్యాన్ని సమాధి చేయాలని అనుకున్నారా? విపక్ష ఎంపీలందరిని బయటకు పంపారు. నిందితులకు పాసులు ఇచ్చిన ఎంపీపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు."
--హర్సిమ్రత్ కౌర్ బాదల్, శిరోమణి అకాలీదళ్ ఎంపీ
"పార్లమెంట్ త్వరలోనే ఉత్తర కొరియా అసెంబ్లీగా మారిపోతుంది. ప్రధాని సభలోకి వస్తుంటే చప్పట్లు కొట్టడం మాత్రమే లేదు. అదీ త్వరలోనే జరుగుతుంది."
-కార్తీ చిదంబరం, కాంగ్రెస్ ఎంపీ
"భద్రతా వైఫల్యం ఘటనపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసిన సభ్యలపై సస్పెన్షన్ వేటు విధించడం, పారదర్శకత, జవాబుదారీ సూత్రాలకు విరుద్ధం. పార్లమెంట్ భద్రతకు సంబంధించి వివరణ కోరే హక్కు సభ్యులకు ఉంటుంది. జరిగిన ఘటన ఎంత తీవ్రమైందో సభ్యుల నిరసనల ద్వారా తెలుస్తోంది. ఇలాంటివి పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు చేపడుతుందో ప్రభుత్వం ఒక ప్రకటన ద్వారా తెలియజేయాలి. కానీ ప్రభుత్వం ఇందుకు విరుద్ధంగా వ్యవహరించడం ఆందోళన కలిగిస్తోంది."
--శరద్ పవార్, ఎన్సీపీ అధినేత