Parliament Special Session 2023 Modi :పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో చారిత్రక నిర్ణయాలు ఉంటాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సోమవారం పార్లమెంటు ప్రత్యేక సమావేశాల ప్రారంభానికి ముందు మీడియాతో మాట్లాడిన ప్రధాని.. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా చూడటమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. భారత్ అభివృద్ధిలో ఎలాంటి అడ్డంకులు ఉండవని స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితులన్నీ భారత్ ఉజ్వల భవిష్యత్‌ను సూచిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా చంద్రయాన్ 3, జీ 20 శిఖరాగ్ర సదస్సులు విజయవంతం కావడం పట్ల ప్రధాని హర్షం వ్యక్తం చేశారు.
"ఈ పార్లమెంటు సమావేశాలు చాలా తక్కువ సమయం ఉన్నప్పటికీ.. చాలా గొప్పవి. ఈ సమావేశాల్లో చారిత్రక నిర్ణయాలు ఉంటాయి. 75 ఏళ్ల ప్రయాణం నుంచి కొత్త గమ్యం ప్రారంభం కావడం ఈ సమావేశాల ప్రత్యేకత. ఇప్పుడు కొత్తగా మన ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలి. ఇందుకోసం రాబోయే కాలానికి సంబంధించిన నిర్ణయాలన్నీ కొత్త పార్లమెంట్ భవనంలోనే తీసుకుంటాం." అని నరేంద్ర మోదీ తెలిపారు. పార్లమెంట్ సభ్యులందరూ సమావేశాలకు హాజరు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశాల్లో మాట్లాడుకునేందుకు చాలా సమయం ఉంటుందని తెలిపారు. ఏడవడానికి తరువాత చాలా సమయం ఉంటుందని ప్రతిపక్షాలను ఉద్దేశిస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు మోదీ.
అదే విధంగా చంద్రయాన్-3 విజయంతో దేశానికి పేరు, ప్రఖ్యాతులు వచ్చాయన్నారు ప్రధాని. కొత్త సంకల్పం దిశగా మరిన్ని అడుగులు ముందుకు వేయాలని ఆయన సూచించారు. భారత్ పురోగతిని ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా సరికొత్త ఉత్సాహం వెల్లివిరుస్తోందని మోదీ తెలిపారు. భారత అభివృద్ధి నిర్విఘ్నంగా కొనసాగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.