Parliament Special Session 2023 :ఐదు రోజులపాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు. అమృత కాలం నేపథ్యంలో జరిగే ఈ ప్రత్యేక సమావేశాల్లో ఫలప్రదమైన చర్చలు జరగాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్(ట్విట్టర్)లో ప్రహ్లాద్ జోషి పోస్ట్ చేశారు.
అజెండా ఏంటి?
Special Session Of Parliament : 'పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు ఐదు రోజులపాటు జరగనున్నాయి. అమృత్ కాల్ వేళ ఈ పార్లమెంటు సమావేశాల్లో చర్చలు ఫలప్రదంగా జరగాలని ఆశిస్తున్నాం' అని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. ప్రస్తుత 17వ లోక్‌సభ.. 13వసారి సమావేశమవుతుండగా రాజ్యసభకు మాత్రం ఇది 261వ సమావేశం. జీ20 సదస్సు ముగిసిన తర్వాత జరిగే ఈ సమావేశాల అజెండా ఏంటనే విషయంపై ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాచారం లేదు.
పార్లమెంట్ కొత్త భవనంలోకి మారేందుకే!
ఈ ప్రత్యేక సమావేశాల అజెండా ఏంటన్న విషయంపై స్పష్టత లేనప్పటికీ.. పార్లమెంటుకొత్త భవనంలోకి మారేందుకే ఈ భేటీ అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ సమావేశాలు పాత భవనంలో మొదలై.. కొత్త భవనంలో ముగుస్తాయని తెలుస్తోంది. వీటితోపాటు జీ20 సదస్సులో కీలక చర్చలు, జమ్ముకశ్మీర్‌లో వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో ఈ ప్రత్యేక సమావేశాలకు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
కాంగ్రెస్ ఫైర్..
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై ప్రతిపక్ష కాంగ్రెస్.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసింది. అదానీ గ్రూప్‌పై వచ్చిన తాజా ఆరోపణలు ప్రధానాంశం కాకుండా వార్తలను మేనేజ్ చేయటానికే మోదీ సర్కార్ పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరపాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ విమర్శించారు. ముంబయిలో జరుగుతున్న ఇండియా కూటమి సమావేశాల్లో ఈ అంశంపై దృష్టి సారించనున్నట్లు ఆయన చెప్పారు. అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణలపై సంయుక్త పార్లమెంటరీ కమిటీతో దర్యాప్తు చేయాలని సభ లోపల, వెలుపలా ఆందోళన కొనసాగుతుందని.. జైరాం రమేష్ ట్వీట్ చేశారు.