Parliament Special Session 2023 :సార్వత్రిక సమరానికి ముందు.. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు సోమవారం నుంచి అయిదు రోజుల పాటు జరగనున్నాయి. పార్లమెంటు 75 ఏళ్ల ప్రయాణంపై.. చర్చే ప్రధాన ఎజెండాగా.. పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తున్నామని ఎన్డీఏ ప్రభుత్వం చెబుతున్నా, ఏదైనా ఆశ్చర్యకర నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని విపక్షాలు అనుమానిస్తున్నాయి. ఎజెండాలో లేని కొత్త చట్టాలు, ఇతర అంశాలను పార్లమెంటులో ప్రవేశపెట్టే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. అందుకే పార్లమెంట్‌లో ఈసారి అనూహ్య అంశాలు జరగవచ్చని కాంగ్రెస్ అధికార ప్రతినిధి జైరాం రమేష్ అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సమయంపై అనుమానం వ్యక్తం చేసిన జైరాం రమేష్.. పార్లమెంట్ 75 ఏళ్ల ప్రయాణంపై చర్చించేందుకే అయితే నవంబర్‌లో జరిగే శీతాకాల సమావేశాల వరకు వేచి ఉండవచ్చు కదా అని ప్రశ్నించారు. ఈ సెషన్‌ను ప్రత్యేక సమావేశంగా అభివర్ణించిన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి.. తర్వాత ఇది సాధారణ సెషన్ మాత్రమేనన్నారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన బిల్లును ప్రభుత్వం ఈ సెషన్‌లో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన బిల్లు సహా జమిలి ఎన్నికలు, మహిళా రిజర్వేషన్ల బిల్లుపై.. కేంద్రం ఎలాంటి వైఖరి అవలంబిస్తుందోననే ఉత్కంఠ కొనసాగుతోంది.
మహిళా రిజర్వేషన్ బిల్లుపై విక్షాల డిమాండ్..
Womens Reservation Bill 2023 :అయితే.. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే మహిళా బిల్లు కూడా ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని బీఆర్ఎస్, బీజేడీ సహా పలు ప్రాంతీయ పార్టీలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో డిమాండ్ చేశాయి. మహిళా బిల్లు ప్రవేశపెట్టి, ఆమోదం పొందేలా ప్రభుత్వంపై ఒత్తిడి చేయనున్నట్లు ఆయా ప్రాంతీయ పార్టీలు పేర్కొన్నాయి. ధరల పెరుగుదల, నిరుద్యోగం, సామాజిక సంక్షోభం, మణిపుర్ తదితర అంశాలను తమ పార్టీ లేవనెత్తనున్నట్లు.. కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ తెలిపారు.