Parliament Sine Die Today : అవిశ్వాస తీర్మానం, మణిపుర్ అంశంపై వాడీవేడిగా సాగిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు శుక్రవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ మేరకు లోక్‌సభను వాయిదా వేస్తున్నట్లు తొలుత స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. వాయిదాకు ముందు మాట్లాడిన స్పీకర్ ఓం బిర్లా.. సభ దాదాపు 39 గంటలు పనిచేసిందని వెల్లడించారు. కీలకమైన డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు 2023, దిల్లీ సవరణ బిల్లులకు ఆమోదం తెలిపిందని చెప్పారు. మరోవైవు, రాజ్యసభను కూడా నిరవధిక వాయిదా వేస్తున్నట్లు ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్ ప్రకటించారు.
ఆన్‌లైన్ గేమింగ్ ట్యాక్స్ బిల్లుకు ఆమోదం
Online Gaming GST Bill : ఆన్‌లైన్ గేమింగ్, క్యాసినో, గుర్రపు పందేలపై 28 శాతం పన్ను విధించే బిల్లులకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఎలాంటి చర్చ లేకుండా మూజువాణి ఓటుతో కేంద్ర వస్తు సేవల పన్ను సవరణ బిల్లు 2023, ఇంటిగ్రేటెడ్ వస్తుసేవల పన్ను సవరణ బిల్లు 2023కు లోక్‌సభ, రాజ్యసభ ఆమోదం తెలిపాయి. రెండు సభల్లోనూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ ఈ బిల్లులను ప్రవేశపెట్టారు. పార్లమెంట్ ఆమోదం పొందడం వల్ల ఈ మేరకు రాష్ట్రాల శాసనసభలు కూడా జీఎస్టీ చట్టాలకు సవరణలు చేయాల్సి ఉంటుంది. సీజీఎస్టీ, ఐజీఎస్టీ చట్టాల సవరణలకు గత వారమే జీఎస్టీ కౌన్సిల్ ఆమోద ముద్ర వేసింది.
ఆన్‌లైన్ గేమింగ్, కాసినోలు, గుర్రపు పందేల్లో ఎంట్రీ లెవెల్ పందేల పూర్తిస్థాయి ముఖ విలువపై 28 శాతం జీఎస్టీ విధిస్తారు. క్యాసినో, హార్స్ రేసింగ్, ఆన్‌లైన్ గేమింగ్ బెట్టింగ్లపై పన్ను విధానంలో పారదర్శకత తీసుకువచ్చేందుకే ఈ చట్టసవరణ చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. బెట్టింగ్ నిర్వహణ సంస్థలు జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్రం నిర్దేశించిన నిబంధనలను పాటించకపోతే.. విదేశాల్లోని ఆన్‌లైన్ గేమింగ్ సంస్థల యాక్సెస్‌ను నిరోధించే వీలు కేంద్రానికి ఉంటుంది.
ఐపీసీ, సీఆర్పీసీ స్థానాల్లో 3 కొత్త బిల్లులు
Criminal Justice Bill : బ్రిటీష్ కాలం నాటి క్రిమినల్ చట్టాలకు కేంద్రం చరమగీతం పాడనుంది. ఇండియన్ పీనల్ కోడ్, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానాల్లో మూడు కొత్త బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టింది. భారత న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్యా బిల్లులను కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు. ఈ బిల్లులను పార్లమెంటరీ ప్యానల్ పరిశీలనకు పంపనున్నట్లు చెప్పారు. రద్దు చేయనున్న ఈ మూడు చట్టాలు.. అప్పట్లో బ్రిటీష్ పాలనను కాపాడేందుకు, బలోపేతం చేయటానికి ఉద్దేశించినవని అమిత్ షా పేర్కొన్నారు. వాటి లక్ష్యం శిక్షించటమే తప్ప న్యాయం అందించటం కాదన్నారు. వాటి స్థానంలో తేనున్న మూడు కొత్త చట్టాలు భారత పౌరుల హక్కులను కాపాడే స్ఫూర్తితో తెస్తున్నట్లు అమిత్ షా పేర్కొన్నారు. మూడు కొత్త చట్టాల లక్ష్యం శిక్షించటం కాదని, న్యాయం అందించటమేనన్నారు. నేరాలను అరికట్టేందుకు మాత్రమే శిక్షలు వేయనున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు.
"1860 నుంచి 1923 వరకు బ్రిటిష్ పార్లమెంటు చేసిన చట్టాల ఆధారంగా మనదేశంలో నేర న్యాయవ్యవస్థ అమలైంది. వాటి స్థానంలో భారతీయ ఆత్మతో ఈ మూడు చట్టాలు అమలవుతాయి. మనదేశ నేర న్యాయవ్యవస్థలో పెద్దమార్పు రానుంది. ఈ బిల్లులను స్థాయి సంఘాలను పంపనున్నాం. వీటి ప్రాధాన్యం ఏమంటే హత్యల నుంచి మహిళలపై అఘాయిత్యాలకు మించిన నేరాలు ఉండవు. వాటిని 302లో చేర్చాం. ఇంతకుముందు రాజద్రోహం, ఖజానా లూటీ, శాసనాధికారులపై దాడి ఉండేవి. ఈ విధానాన్ని మార్చుతున్నాం. మొట్టమొదటి చాప్టర్‌లో మహిళలు, బాలలపై అఘాయిత్యాలు ఉంటాయి. రెండో చాప్టర్‌లో మానవ వధ, మనవ శరీరంతో జరిగే నేరాలు ఉంటాయి. మేం పాలనకు బదులు పౌరులే కేంద్రంగా అతిపెద్ద సైద్ధాంతిక నిర్ణయంతో ఈ బిల్లులు తెచ్చాం"