Parliament Sine Die Today :బ్రిటీష్ కాలం నాటి చట్టాల స్థానంలో తీసుకువచ్చిన మూడు క్రిమినల్ బిల్లులకు ఆమోదం తెలిపిన అనంతరం పార్లమెంట్ నిరవధికంగా వాయిదా పడింది. లోక్సభలో ఆమోదం పొందిన భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య బిల్లులకు రాజ్యసభ పచ్చజెండా ఊపింది. అనంతరం రాజ్యసభ వాయిదా వేశారు ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్. రాష్ట్రపతి సంతకం అనంతరం భారతీయ న్యాయ సంహిత BNS, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత BNSS, భారతీయ సాక్ష్యా-BS చట్టాలుగా మారనున్నాయి.
రీ డ్రాఫ్ట్ అయిన 3 బిల్లులను ఆమోదించే తీర్మానాన్ని రాజ్యసభలో ప్రవేశపెట్టిన కేంద్రహోంమంత్రి అమిత్‌షా బ్రిటిష్ పార్లమెంటులో తయారు చేసిన ఈ చట్టాలకు ప్రధాని మోదీ 75 ఏళ్ల తర్వాత చరమగీతం పాడాలనుకున్నారని చెప్పారు. బ్రిటిష్ ప్రభుత్వం స్వప్రయోజనాల కోసం ఈ చట్టాలను తీసుకొచ్చినట్లు వివరించారు. కొత్తగా తీసుకొచ్చే చట్టాల ముఖ్యోద్దేశం ప్రజలను శిక్షించడం కాదనీ, న్యాయం అందించడమని పేర్కొన్నారు. FIR నమోదు నుంచి తీర్పు వరకు అన్ని వివరాలు ఆన్‌లైన్‌లో ఉండేలా రూపొందించినట్లు చెప్పారు. ఈ చట్టాల అమలుతో మూడేళ్లలో బాధితులకు సత్వర న్యాయం అందుతుందని స్పష్టం చేశారు.
ఈ బిల్లుతో పాటు దేశ భద్రతను ప్రమాదం తలెత్తిన సమయంలో టెలికమ్యూనికేషన్ సేవలను ప్రభుత్వం అధీనంలోకి తీసుకునేలా ప్రవేశపెట్టిన టెలికాం బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. కేంద్ర సమాచార, ఎలక్ట్రానిక్స్ మంత్రి అశ్వినీ వైష్ణవ్ సభలో ప్రవేశపెట్టగా స్వల్పకాలిక చర్చతోనే బిల్లుకు ఆమోదం తెలిపింది రాజ్యసభ. బుధవారమే ఈ బిల్లుకు లోక్‌సభ పచ్చజెండా ఊపింది. ఆ తర్వాత ప్రెస్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పిరియాడికల్స్ బిల్లు 2023కు సైతం ఆమోదం తెలిపిన తర్వాత లోక్‌సభ వాయిదా పడింది.