పార్లమెంటు వేదికగా రసవత్తర 'పోరు'కు రంగం సిద్ధమైంది. ప్రతిపక్షాల ఎత్తులు- ప్రభుత్వం పైఎత్తులు, అధికారపక్ష సభ్యుల వ్యూహాలు- ప్రతిపక్ష నేతల ప్రతివ్యూహాలతో ఉభయ సభలు ఇక వేడెక్కనున్నాయి. సోమవారం నుంచే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 13 వరకు వీటిని కొనసాగించనున్నారు. పెట్రో ధరల పెరుగుదల, సాగు చట్టాల రద్దు, రఫేల్ ఒప్పందంపై దర్యాప్తు వంటి అంశాలపై ప్రభుత్వాన్ని తాజా సమావేశాల్లో ఇరుకున పెట్టేందుకు విపక్షాలు సిద్ధమమయ్యాయి. వాటిని దీటుగా ఎదుర్కొనేందుకు అధికార పక్షం పక్కా ప్రణాళికలు రూపొందించుకుంది! మరోవైపు- వర్షాకాల సమావేశాల్లో అర్థవంతమైన, ఆరోగ్యకర చర్చ జరగాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు.
ఆ అంశాలపైనే..
సుహృద్భావ వాతావరణంలో చర్చలను కొనసాగిద్దామని అఖిలపక్ష సమావేశంలో ఆయన పిలుపునిచ్చారు. కొత్తగా కేబినెట్‌లోకి తీసుకున్న మంత్రులను.. సంప్రదాయం ప్రకారం ఉభయ సభల్లో ప్రధాని సోమవారం పరిచయం చేయనున్నారు. వర్షాకాల సమావేశాల ప్రారంభం నేపథ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి దిల్లీలో ఆదివారం అఖిలపక్ష భేటీ నిర్వహించారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, పీయూష్ గోయల్ సహా 33 పార్టీల నుంచి 40 మందికి పైగా నేతలు ఇందులో పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. నూతన సాగుచట్టాల రద్దు, పెట్రో ధరలు, నిత్యావసరాల ధరల పెరుగుదల, కరోనా రెండో ఉద్ధృతి నియంత్రణలో వైఫల్యం, ఆర్థిక వ్యవస్థ మందగమనం, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, రఫేల్ ఒప్పందంపై దర్యాప్తు వంటి అంశాలను విపక్ష నేతలు ప్రస్తావించారు.
రైతులు 8 నెలలుగా చలి, ఎండ, వానలను లెక్కచేయకుండా సాగుచట్టాల రద్దు కోసం దిల్లీ సరిహద్దుల్లో నిరసనలను కొనసాగిస్తున్న సంగతిని గుర్తుచేశారు. ఆ చట్టాలను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. చర్చల పేరుతో అన్నదాతలను ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపించారు. డిస్కంల ప్రైవేటీకరణకు సంబంధించిన విద్యుత్తు చట్ట సవరణ బిల్లును తీసుకురాకూడదన్న డిమాండ్‌కు ప్రభుత్వం గతంలో అంగీకరించిందని, ఇప్పుడు మాట తప్పి బిల్లును రాబోయే సమావేశాల్లో ప్రవేశపెట్టబోతోందని పేర్కొన్నారు.
సుహృద్భావం.. అందరి బాధ్యత: మోదీ
ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్య సంప్రదాయాలను కొనసాగించాలని అఖిలపక్ష భేటీలో ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలను ఆమోదయోగ్య రీతిలో సభలో ప్రస్తావించాలని సూచించారు. "సమావేశంలో సభ్యులంతా విలువైన సలహాలు ఇచ్చారు. ఉభయ సభల్లో అర్థవంతమైన చర్చలు జరగాలి. ఈ సమావేశంలో వచ్చిన సలహాలను అమలుచేయడానికి అందరం కలిసికట్టుగా ప్రయత్నిద్దాం. సుహృద్భావ వాతావరణాన్ని సృష్టించే బాధ్యత అందరిపైనా ఉంది. ప్రజాప్రతినిధులకు క్షేత్రస్థాయి పరిస్థితుల గురించి పూర్తిగా తెలుసు. వారు చర్చల్లో పాల్గొని వాస్తవాలను సభ దృష్టికి తీసుకొస్తే నిర్ణయాలు తీసుకునే ప్రక్రియ మరింత మెరుగుపడుతుంది. అత్యధిక మంది ఎంపీలు ఇప్పటికే కరోనా టీకా తీసుకున్నారు కాబట్టి పార్లమెంటు కార్యకలాపాలను ధైర్యంగా చేపట్టవచ్చు. సభలో ఆరోగ్యకరమైన చర్చలు జరిగేలా అన్ని పార్టీల నేతలు సహకరించాలి" అని మోదీ పేర్కొన్నారు.
సజావుగా సాగేందుకు సహకరించండి: జోషి
నిబంధనల ప్రకారం ప్రతిపక్షాలు ప్రస్తావించే ఏ అంశంపైనైనా పార్లమెంటులో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రహ్లాద్ జోషీ అన్నారు. సభ సజావుగా సాగడానికి అన్ని పక్షాలు సహకరించాలని కోరారు. తాజా సమావేశాల్లో పార్లమెంటు ముందుకు మొత్తం 31 అంశాలను ప్రభుత్వం తీసుకొస్తుందన్నారు. అందులో 29 బిల్లులు, 2 ఆర్థికాంశాలు ఉన్నాయని చెప్పారు. 6 ఆర్డినెన్సుల స్థానంలో బిల్లులు ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. వాటిలో ట్రైబ్యునల్ సంస్కరణల బిల్లు, దివాలా స్మృతి సవరణ బిల్లు వంటివి ఉన్నాయన్నారు. అఖిలపక్ష భేటీలో భాజపా, కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, వైకాపా, శివసేన, జేడీయూ, తెరాస, ఏఐఏడీఎంకే, బీఎస్పీ, ఎన్సీపీ, తెదేపా, అకాళీదళ్, సీపీఐ, సీపీఎం తదితర పార్టీల నేతలు పాల్గొన్నారు.
విడిగా సమావేశాలు
అఖిలపక్ష భేటీ తర్వాత కాంగ్రెస్, దాని మిత్రపక్షాల నాయకులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వర్షాకాల సమావేశాల్లో ఎలా ముందుకు సాగాలనేదానిపై చర్చలు జరిపారు. రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే, శరద్ పవార్‌లతో పాటు తృణమూల్, శివసేన, ఆప్, సీపీఐ, సీపీఎంల నేతలు పాల్గొన్నారు. వర్షాకాల సమావేశాలు జరిగినన్ని రోజులు పార్లమెంటుకు తప్పనిసరిగా రావాలని కాంగ్రెస్ ఎంపీలను సోనియా గాంధీ ఆదేశించినట్లు ఆ పార్టీ ఎంపీ ఒకరు 'ఈటీవీ భారత్'తో చెప్పారు. లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజా సమస్యలను ప్రభావవంతంగా లేవనెత్తాలని ఆమె సూచించినట్లు తెలిపారు. మరోవైపు- ఎన్డీయే మిత్రపక్షాల ఫ్లోర్ లీడర్లతో ప్రధాని విడిగా భేటీ అయ్యారు. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, భాజపా జాతీయాధ్యక్షుడు జె.పి.నడ్డా, అనుప్రియా పటేల్ (అప్నాదళ్), రామ్‌నాథ్ ఠాకూర్ (జేడీయూ), రాందాస్ అఠవాలె (ఆర్‌పీఐ) తదితరులు పాల్గొన్నారు.