Parliament Security Breach Today :లోక్‌సభ ఛాంబర్లో ఆగంతకులు సృష్టించిన కలకలంపై విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. ఈ ఘటనలో ఆరుగురి ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఇప్పటికే నిందితుల్లో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నామని, మరొకరి కోసం గాలిస్తున్నామని పేర్కొన్నాయి. అరెస్టైన నిందితుల వద్ద సెల్ఫోన్లు లభ్యం కాలేదని వెల్లడించాయి. ఆరుగురు నిందితులు ఒకరికొకరు ఇంతకుముందు 4 ఏళ్ల నుంచే పరిచయం ఉన్నారని, వీరందరూ హరియాణాలోని గుర్‌గ్రామ్‌లో ఓ ఇంట్లో ఉన్నారని పేర్కొన్నాయి. వీరంతా కొద్దిరోజుల క్రితమే కుట్ర పన్ని, రెక్కీ నిర్వహించారని వెల్లడించాయి. ఆరుగురూ సభ లోపలకు వెళ్దామని అనుకున్నా.. ఇద్దరికే విజిటర్ పాసులు వచ్చాయని పోలీసు వర్గాలు చెప్పాయి. వీరి వెనుక ఎవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు స్పష్టం చేశాయి. నిందితుల మొబైల్స్ ఎక్కడున్నాయో తెలుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీస్ వర్గాలు తెలిపాయి.
'అకస్మాత్తుగా ఛాంబర్లోకి దూకారు'
మరోవైపు, లోక్‌సభలోని విజిటర్స్ గ్యాలరీలో ఇద్దరు వ్యక్తులు కాసేపు నిశబ్దంగా కూర్చున్నారని ఆ తర్వాత ఛాంబర్లోకి ఒక్కసారిగా దూకారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కొంతమంది లోక్‌సభ ఎంపీలు నిందితులను వెంబడిస్తున్న సమయంలో వారిలో ఒకరు పొగ డబ్బాను సభలోకి విసిరారని సందర్శకుల గ్యాలరీ వద్ద కూర్చున్న ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. సందర్శకుల గ్యాలరీలో కూర్చున్నప్పుడు నిందితులు ఎటువంటి నినాదాలు చేయలేదని వెల్లడించారు. నిందితులు లోక్‌సభ ఛాంబర్లోకి దూకినప్పుడు సందర్శకుల గ్యాలరీలో దాదాపు 30 నుంచి 40 మంది ఉన్నారని అన్నారు. ఐదు అంచెల భద్రత ఉన్నప్పటికీ పార్లమెంట్‌లో ఇలాంటి ఘటన జరగడం దిగ్భ్రాంతి కలిగించిందని మరో ప్రత్యక్ష సాక్షి తెలిపారు.
'నా కుమారుడు నిజాయితీపరుడు'
తన కుమారుడు నిజాయితీపరుడని, సమాజానికి సేవ చేయాలని ఎల్లప్పుడూ ఆలోచిస్తాడని నిందితుడు మనోరంజన్ తండ్రి దేవరాజె గౌడ తెలిపారు. తన కొడుకు తప్పు చేస్తే ఊరి తీసేయమని అన్నారు. 'పార్లమెంట్‌పై దాడిని ఖండిస్తున్నా. నా కొడుకు చాలా మంచివాడు, నిజాయితీపరుడు. ఎల్లప్పుడూ సమాజం కోసం ఆలోచిస్తాడు. స్వామి వివేకానంద పుస్తకాలు ఎక్కువగా చదివేవాడు. ఆ పుస్తకాలు చదివిన తర్వాత అతడిలో ఆలోచనల్లో మార్పు వచ్చిందనకుంటున్నా. 2016లో బీఈ (బ్యాచిలర్ ఇన్ ఇంజనీరింగ్) పూర్తి చేశాడు. ప్రస్తుతం పొలం పనులు చూసుకుంటున్నాడు. ఇంతకుముందు దిల్లీ, బెంగళూరులోని కొన్ని సంస్థల్లో ఉద్యోగం చేశాడు.' అని దేవరాజెగౌడ మీడియాతో చెప్పారు.
'నిరసన తెలపడానికి దిల్లీకి'
లోక్‌సభలో ఛాంబర్లో దూకిన ఘటనలో అరెస్టైన సాగర్ శర్మ దిల్లీలో నిరసన తెలపడానికి కొద్ది రోజుల క్రితం లఖ్‌నవూలోని తన ఇంటి నుంచి వెళ్లాడని అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. పార్లమెంట్ భద్రతా ఉల్లంఘనలో అతడి ప్రమేయం గురించి తమకు తెలియదని అన్నారు. సాగర్ శర్మ ఈ-రిక్షా నడిపేవాడని, కొన్నాళ్ల క్రితం బెంగళూరులో ఉద్యోగం చేసేవాడని అతడి సోదరి తెలిపింది.