Parliament Security Breach Probe : పార్లమెంట్‌లో భద్రతా ఉల్లంఘన ఘటనలో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. నిందితులు తొలుత తమకు తాము నిప్పంటించుకోవడం, కరపత్రాలను విసిరేయడం వంటి ప్రణాళికలూ రూపొందించినట్లు పోలీసులు తెలిపారు. అయితే చివరకు ఆ ప్రయత్నాలను విరమించి, బుధవారం అమలు చేసిన ప్లాన్‌తో ముందుకెళ్లినట్లు తెలిపారు. విచారణలో భాగంగా నిందితులు ఈ వివరాలు వెల్లడించినట్లు పేర్కొన్నారు. మరోవైపు పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన కేసులో ఇద్దరు నిందితులకు విజిటర్ పాసులు జారీ చేసిన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా వాంగ్మూలాన్ని కూడా పోలీసులు నమోదు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
'లోక్‌సభ ఛాంబర్‌లోకి దూకే ప్రణాళికను ఖరారు చేయడానికి ముందు నిందితులు ప్రభుత్వానికి తమ సందేశాన్ని బలంగా పంపేందుకు ఇతర మార్గాలనూ అన్వేషించారు. తమ ఒంటికి ఫైర్‌ప్రూఫ్ జెల్ పూసుకుని తమకు తాము నిప్పంటించుకునే ప్లాన్ వేశారు. పార్లమెంట్ లోపల కరపత్రాలను విసరాలని కూడా భావించారు. కానీ, చివరకు బుధవారం నాటి ప్రణాళిక (లోక్‌సభ ఛాంబర్‌లోకి దూకడం) అమలు చేశారు' అని ఓ పోలీసు అధికారి తెలిపారు.
మరోవైపు, పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన కేసును పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా అధికారులు శుక్రవారం అర్ధరాత్రి నిందితులను గతంలో వారు కలిసిన, ఈ కుట్రకు ప్లాన్ చేసిన ప్రాంతాలకు తీసుకెళ్లారు. ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న లలిత్ ఝాను త్వరలో రాజస్థాన్‌లోని నాగౌర్‌కు తీసుకెళ్లనున్నారు. పార్లమెంట్‌లో ఘటనల అనంతరం దిల్లీ నుంచి రాజస్థాన్‌కు పారిపోయిన లలిత్ ఝా గురువారం రాత్రి పోలీసులకు లొంగిపోయాడు. సాక్ష్యాధారాలను నాశనం చేసే ప్రయత్నంలో భాగంగా తన ఫోన్‌ను పారేసిన, ఇతరుల ఫోన్లను కాల్చేసిన ప్రాంతాలకు లలిత్ ఝాను తీసుకెళ్లనున్నారు. శనివారం లేదా ఆదివారం పార్లమెంట్‌లోనూ 'సీన్ రీక్రియేషన్' చేయనున్నట్లు సమాచారం.
మరో నిందితుడు అరెస్ట్
పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన కేసులో మరో నిందితుడు మహేశ్ కుమావత్‌ను దిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని దిల్లీ కోర్టులో పోలీసులు ప్రవేశపెట్టారు. నిందితుడు మహేశ్ కుమావత్‌కు దిల్లీ కోర్టు వారం రోజుల పోలీస్ కస్టడీ విధించింది. మహేశ్ కుమావత్‌ను 15 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని అభ్యర్థించారు ప్రభుత్వ న్యాయవాది. ఈ కేసులో సాక్ష్యాధారాలను నాశనం చేయడంలో మహేశ్ ప్రమేయం ఉందని వాదించారు. దేశంలో అరాచకం వ్యాప్తి చేయడానికి రూపొందించిన కుట్రలో భాగమయ్యాడని, దీంతో అతడిని విచారించాల్సి ఉందని తెలిపారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం, నిందితుడు మహేశ్ కుమావత్‌కు ఏడు రోజుల కస్టడీకే అనుమతించింది.