Parliament Security Breach MPs Suspend : లోక్‌సభలో భద్రతా ఉల్లంఘన ఘటనపై విపక్షాల ఆందోళనలతో పార్లమెంట్ అట్టుడికింది. ఈ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వివరణ ఇవ్వాలంటూ విపక్ష ఎంపీలు చేసిన ఆందోళనలతో ఉభయసభలు పలుమార్లు వాయిదా పడ్డాయి. నినాదాలు చేస్తూ సభా కార్యకలాపాలను అడ్డుకుంటున్నారని మొత్తం 14 మంది ఉభయసభల ఎంపీలను ఈ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయినవారిలో 13 మంది లోక్‌సభ సభ్యులు కాగా ఒకరు రాజ్యసభ ఎంపీ.
లోక్‌సభలో నినాదాలు చేస్తూ సభా కార్యకలాపాలను అడ్డుకుంటున్నారని ఐదుగురు కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేయాలని కోరుతూ కేంద్ర మంత్రి ప్రహ్లద్ జోషి తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని సభ ఆమోదించడం వల్ల టీఎన్ ప్రతాపన్, హిబీ ఈడెన్, ఎస్. జోతిమణి, రమ్య హరిదాస్, డీన్ కురియాకోస్ ఈ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేశారు స్పీకర్ ఓం బిర్లా. కాసేపు విరామం అనంతరం మధ్యాహ్నం 3 తర్వాత మళ్లీ సభ ప్రారంభమైనా ఎంపీలు నిరసనలు ఆపలేదు. దీంతో సభాకార్యక్రమాలకు విఘాతం కలిగిస్తున్న మరో 9మందిని సస్పెండ్ చేయాలని తీర్మానం ప్రవేశపెట్టారు ప్రహ్లద్ జోషి. బెన్నీ బెహనాన్, వీకే శ్రీకందన్, మహ్మద్ జావేద్, పీఆర్ నటరాజన్, కనిమొళి, కే సుబ్రహ్మణ్యం, ఎస్ వెంకటేశన్, మాణిక్యం ఠాగూర్ సస్పెండ్ అయ్యినవారిలో ఉన్నారు. ప్రతిపక్ష ఎంపీల నిరసనల నేపథ్యంలో లోక్‌సభ శుక్రవారానికి వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా. సభలో లేని ఎంపీ పార్థిబన్ పేరును సైతం తొలుత సస్పెండ్ అయిన జాబితాలో చేర్చారు. అయితే, అది సిబ్బంది పొరపాటు వల్ల జరిగిందని తర్వాత కేంద్ర మంత్రి ప్రహ్లద్ జోషి వివరణ ఇచ్చారు. రాజ్యసభలో టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్‌పై వేటు పడింది.
'ఈ అంశాన్ని రాజకీయం చేయవద్దు'
అంతకుముందు ప్రతిపక్ష ఎంపీల నిరసనల మధ్యే కేంద్రమంత్రి ప్రహ్లోద్ లోక్‌సభ భద్రతా ఉల్లంఘనపై మాట్లాడారు. లోక్‌సభలో భద్రతా ఉల్లంఘనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించామని, ఆ అంశాన్ని రాజకీయం చేయవద్దని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ ఛాంబర్లో బుధవారం జరిగిన దురదృష్టకర ఘటన ఎంపీల భద్రతకు సంబంధించి తీవ్రమైనదిగా పరిగణిస్తున్నామని తెలిపారు. ఘటన జరిగిన వెంటనే లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఫ్లోర్ లీడర్‌లతో సమావేశం నిర్వహించి పార్లమెంట్ భద్రతను మరింత పటిష్ఠం చేసేందుకు విపక్షాల సూచనలు విన్నారని జోషి పేర్కొన్నారు. ఎంపీలు ఇచ్చిన కొన్ని సూచనలను ఇప్పటికే అమలు చేశామని, భవిష్యత్తులో కూడా పార్లమెంట్ భద్రతను మరింత పటిష్ఠంగా ఉంచేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటామని స్పీకర్ స్వయంగా చెప్పారని జోషి గుర్తు చేశారు. ప్రతీ అంశాన్ని రాజకీయం చేయడం కొంతమంది సభ్యులకు అలవాటుగా మారిందని విపక్షాలకు కౌంటర్ వేశారు ప్రహ్లోద్ జోషి.
'లోక్‌సభ ఛాంబర్లో జరిగిన ఘటన ఎంపీలందరికీ సంబంధించినది. ఆ సమస్యపై అందరం కలిసికట్టుగా మాట్లాడాలి. ఇటువంటి జాతీయ సమస్యపై ఎవరూ రాజకీయాలు చేయరు. పార్లమెంట్ భద్రతా ఉల్లంఘనపై అత్యున్నత స్థాయి విచారణ కోసం హోంశాఖ కార్యదర్శికి స్పీకర్ లేఖ రాశారు. ఇప్పటికే విచారణ ప్రారంభమైంది.' అని ప్రహ్లోద్ జోషి లోక్‌సభలో మాట్లాడారు.
డెరెక్‌పై వేటు
మరోవైపు, రాజ్యసభలోనూ విపక్షాల ఆందోళనలు మిన్నంటాయి. ఉదయం 11గంటలకు రాజ్యసభ సమావేశం కాగానే పార్లమెంటులో భద్రతా వైఫల్యంపై చర్చించాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. వెల్‌లోకి దూసుకెళ్లి పెద్దఎత్తున నినాదాలు చేశారు. ప్రశ్నోత్తరాలను అడ్డుకున్నారు. విపక్ష సభ్యులు తమ స్థానాలకు వెళ్లి కూర్చోవాలని ఛైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ సూచించారు. అందుకు టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ తిరస్కరించారు. డెరెక్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ధన్‌ఖడ్- ఆయన ప్రవర్తన ఛైర్మన్ అధికారాలను ధిక్కరించేలా ఉందన్నారు. ఈ క్రమంలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ డెరెక్ ఒబ్రెయిన్‌ను సభ నుంచి సస్పెండ్ చేస్తూ ఓ తీర్మానం ప్రవేశపెట్టారు. దీనికి సభ్యులు మద్దతు పలకగా ఈ సెషన్ ముగిసే వరకు డెరెక్‌ను సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఛైర్మన్ ధన్‌ఖడ్ ప్రకటించారు.
'కాంగ్రెస్-లెఫ్ట్‌కు సంబంధం ఉంది'
పార్లమెంట్ వెలుపల సైతం అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. సెక్యూరిటీ ఉల్లంఘన ఘటనతో కాంగ్రెస్-కమ్యూనిస్టులకు సంబంధం ఉందని బీజేపీ ఆరోపించింది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో క్రియాశీలంగా పాల్గొన్న వారు గతంలోనూ అనేక నిరసనలు చేశారని బీజేపీ ప్రతినిధి అమిత్ మాలవీయ ఎక్స్‌లో ఆరోపించారు.