Parliament Security Breach Master Mind Lalit Jha :పార్లమెంట్ దాడి ఘటనలో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న లలిత్ ఝా అమాయకుడని, ఏమి తెలియదని అతడి తండ్రి దేవానంద్ ఝా అంటున్నాడు. అతడు ట్యూషన్లు చెపుతూ జవనం సాగిస్తున్నాడని తెలిపాడు. తమను బిహార్‌లోని దర్భంగా పంపించి, వ్యక్తిగత పని మీద దిల్లీ వెళ్తున్నట్లు చెప్పి డిసెంబర్ 10న రైలులో బయలుదేరాడని చెప్పాడు. చివరగా తాము లలిత్‌తో మాట్లాడింది అదేనని అతడు తెలిపాడు. ఎందుకోసం దిల్లీ వెళ్లాడో తమకు తెలియదని చెప్పాడు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారనే సమాచారం ఇతరుల ద్వారా తమకు తెలిసిందని వెల్లడించాడు. తన కుమారుడికి న్యాయం జరిగేందుకు కోర్టును ఆశ్రయిస్తామని వివరించాడు.
ఈ ఘటనలో లలిత్ ఎలా చిక్కుకున్నాడో తమకు తెలియదని లలిత్ సోదరుడు శంభు ఝా తెలిపాడు. 'అతడు (లలిత్) ఎప్పుడూ ఇబ్బందులకు దూరంగా ఉంటాడు. అతడు చిన్నప్పటి నుంచి ఎక్కువ ఎవరితో మాట్లడకుండా ప్రశాంతంగా ఉండేవాడు. ట్యూషన్లు చెప్పడమే కాకుండా లలిత్ పలు NGOలతో కూడా పనిచేసేవాడు. టీవీ ఛానెళ్లలో అతడి ఫొటోలు చూసి మేము ఆశ్చర్యానికి గురయ్యాము' శంభు ఝా విలేకరులతో చెప్పాడు.
పార్లమెంట్ ఘటన జరిగిన తర్వాత లలిత్ మోహన్ ఝా స్వయంగా వచ్చి కర్తవ్యపథ్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. అయితే లొంగిపోవడానికి ముందే లలిత్ కీలక ఆధారాలను ధ్వంసం చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. పార్లమెంట్ ఘటన తర్వాత రాజస్థాన్‌లోని కూచమన్‌కు పారిపోయిన లలిత్ అక్కడ తన స్నేహితుడు మహేష్‌తో కలిసి నలుగురు నిందితుల ఫోన్లను తగులబెట్టినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
'దేశంలో ఆరాచకం సృష్టించేందుకు కుట్ర'
Parliament Security Breach Probe :పార్లమెంట్‌లో చొరబాటు ద్వారా దేశంలో అరాచకం సృష్టించేందుకు (Parliament Security Breach Reason) నిందితులు కుట్ర పన్నారని తాజాగా దిల్లీ పోలీసులు తెలిపారు. తద్వారా తమ డిమాండ్లు నెరవేర్చేలా ప్రభుత్వాపై ఒత్తిడి తేవాలనుకున్నారని వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న లలిత్ ఝాను తమ కస్టడీకి ఇవ్వాలని దిల్లీ ప్రత్యేక విభాగం పోలీసులు కోరారు. ఈ మేరకు పటియాలా హౌజ్ కోర్టులో పలు వివరాలు వెల్లడించారు.