Parliament Security Breach Enquiry Committee: పార్లమెంట్‌పై ఉగ్రదాడి జరిగి 22ఏళ్లు అయిన రోజే లోక్‌సభలో భద్రతా వైఫల్యం చోటు చేసుకోవడంపై ముమ్మర దర్యాప్తు సాగుతోంది. స్పీకర్ కోరిక మేరకు హోంశాఖ దర్యాప్తు కమిటీని నియమించింది. ఈ ఘటనపై దిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఉపా(UAPA) చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. సందర్శకుల గ్యాలరీ నుంచి ఇద్దరు లోక్‌సభలోకి దూకిన ఘటనలో ఇప్పటివరకు ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరొకరి కోసం గాలిస్తున్నారు. నిందితులు పక్కా ప్రణాళిక ప్రకారమే దుస్సాహసానికి పాల్పడ్డారని తెలుస్తోంది.
పక్కా ప్రణాళిక ప్రకారమే..
లోక్‌సభలో భద్రతా వైఫల్యం ఘటనలో సాగర్ శర్మ, మనోరంజన్ , నీలమ్, అమోల్ శిందే, విశాల్, లలిత్ అనే ఆరుగురు నిందితులు పక్కా ప్రణాళిక ప్రకారం దుస్సహసానికి పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు. ఈ ఆరుగురు నిందితులకు నాలుగేళ్లుగా ఒకరితో ఒకరికి పరిచయం ఉందన్నారు. పార్లమెంటులో చొరబాటుకు కొన్నిరోజుల క్రితమే ఆరుగురు ప్రణాళిక రచించారని పోలీసులు చెప్పారు. అందుకోసం సామాజిక మాధ్యమాల్లో నిరంతరం సంప్రదింపులు జరిపినట్లు వివరించారు. ఇప్పటివరకు ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆరో నిందితుడు లలిత్ కోసం గాలిస్తున్నారు. నిందితుల ఇళ్లకు వెళ్లిన ఆయా రాష్ట్రాల పోలీసులు వారి గురించి ఆరా తీశారు. దొరికిన ఐదుగురిని దిల్లీ పోలీసులు వివిధ కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. మణిపుర్ సంక్షోభం, రైతుల నిరసనలు, నిరుద్యోగిత వంటి అంశాలతో నిరాశకు గురై ఈ ఘటనకు పాల్పడినట్టు ఒక నిందితుడు చెప్పినట్లు తెలుస్తోంది.
పార్లమెంట్ వద్ద తాజా సంచలన ఘటనలపై దర్యాప్తు కోసం లోక్‌సభ సచివాలయం వినతి మేరకు కేంద్ర హోంశాఖ ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. దర్యాప్తుతోపాటు భవిష్యత్తులో చేపట్టాల్సిన మెరుగైన భద్రతా చర్యలను సిఫార్సు చేయాలని లోక్‌సభ సచివాలయం తెలిపింది. కమిటీకి సీఆర్పీఎఫ్ డీజీ అనీశ్ దయాల్ నేతృత్వం వహిస్తారు. కమిటీలో ఇతర భద్రతా సంస్థల అధికారులు, నిపుణులు సభ్యులుగా ఉంటారని హోంశాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. వీలైనంత త్వరగా కమిటీ నివేదికను సమర్పిస్తుందని తెలిపారు.