Parliament Security Breach Case Karnataka Techie : పార్లమెంటులోకి చొరబడి అలజడి సృష్టించిన కేసులో దిల్లీ పోలీసుల దర్యాప్తు చురుగ్గా సాగుతోంది. ఈ క్రమంలో దిల్లీ పోలీసులు ప్రత్యేక విభాగం మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుంది. వారిలో ఒకరిది కర్ణాటక అని, మరొకరిది ఉత్తర్‌ప్రదేశ్ అని తేలింది. ఫేస్బుక్లో డిలీట్ చేసిన భగత్ సింగ్ ఫ్యాన్ క్లబ్లో సభ్యులని అనుమానిస్తున్నారు పోలీసులు. కర్ణాటకకు చెందిన వ్యక్తి మాజీ డీఎస్పీ కుమారుడు సాయికృష్ణ జగాలి అని పోలీసు వర్గాలు వెల్లడించాయి.
లోక్‌సభలో అలజడి సృష్టించిన మనోరంజన్‌కు అతడు స్నేహితుడు. మైసూరుకు చెందిన మనోరంజన్, బాగల్‌కోటెకు చెందిన సాయికృష్ణ బెంగళూరులోని ఇంజినీరింగ్ కళాశాలలో కలిసి చదువుకున్నారు. విచారణలో భాగంగా మనోరంజన్ చెప్పిన వివరాల ఆధారంగా బుధవారం సాయంత్రం సాయికృష్ణను బాగల్‌కోటెలోని అతడి ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్నారు. అతడిని దిల్లీకి తరలించి విచారించనున్నారు. తాజా పరిణామాలపై సాయికృష్ణ సోదరి మీడియాతో మాట్లాడారు. "తన సోదరుడు ఎలాంటి తప్పు చేయలేదు. దిల్లీ పోలీసులు తన సోదరుడిని ప్రశ్నించారు. విచారణకు మేము పూర్తిగా సహకరించాం. చదువుకున్నప్పుడు సాయికృష్ణ, మనోరంజన్ ఒకే ఇంట్లో ఉండేవారు. ఇప్పుడు నా సోదరుడు ఇంటి నుంచి పని చేస్తున్నాడు' అని తెలిపారు.
సాయితో పాటు ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన మరొకరిని కూడా దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరూ డిలీట్ చేసిన ఫేస్‌బుక్ పేజీలోని భగత్ సింగ్ ఫ్యాన్ క్లబ్ సభ్యులని తెలుస్తోంది. పార్లమెంటులోకి చొరబడే ముందు ఆ పేజీని నిందితులు క్రియేట్ చేశారు. తర్వాత తొలిగించారు. కొత్తగా అదుపులోకి తీసుకున్న ఇద్దరినీ స్పెషల్ సెల్ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు, పార్లమెంట్ భద్రతను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(CISF)కు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.