Parliament Security Breach Case : పార్లమెంట్‌లో అలజడి రేపిన ఘటనలో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే నిందితులపై తీవ్రవాద చర్యల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలోనే డిసెంబరు 13 నాటి అలజడి ఘటనను సీన్ రీక్రియేట్ చేయాలని పోలీసులు యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. నిందితులను పార్లమెంట్‌కు తీసుకెళ్లి శని లేదా ఆది వారాల్లో సీన్ రీక్రియేషన్ చేయనున్నట్లు సమాచారం.
తనిఖీలను తప్పించుకుని నిందితులు రంగు పొగ గొట్టాలతో పార్లమెంట్ లోపలికి ఎలా వెళ్లగలిగారు? లోక్‌సభలో తమ ప్రణాళికను ఎలా అమలు చేశారు? వంటివి తెలుసుకునేందుకు ఈ రీక్రియేషన్ ఉపయోగపడుతుందని స్పెషల్ సెల్ విభాగ వర్గాలు తెలిపాయి. వాస్తవానికి ఘటన జరిగిన రోజే ఈ సీన్ రీక్రియేషన్ ప్రక్రియ చేపట్టాలని పోలీసులు భావించిగా, సభా కార్యకలాపాల వల్ల అది సాధ్యపడలేదు. శని, ఆది వారాల్లో పార్లమెంట్ సమావేశాలు లేకపోవడం వల్ల ఆ రోజుల్లో దీనిని చేపట్టాలని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
లొంగిపోయిన ప్రధాన సూత్రధారి
లోక్‌సభ ఘటనలో ప్రధాన సూత్రధారిగా అనుమానిస్తున్న లలిత్ మోహన్ ఝా స్వయంగా వచ్చి కర్తవ్యపథ్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. విచారణ కోసం లలిత్‌ను స్పెషల్ సెల్ కు అప్పగించినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. అయితే లొంగిపోవడానికి ముందే లలిత్ కీలక ఆధారాలను ధ్వంసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. పార్లమెంట్ ఘటన తర్వాత రాజస్థాన్‌లోని కూచమన్‌కు పారిపోయిన లలిత్ అక్కడ తన స్నేహితుడు మహేష్‌తో కలిసి నలుగురు నిందితుల ఫోన్లను తగులబెట్టినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
పార్లమెంట్‌లో అలజడి రేపడానికి ముందు లలిత్ ఝా నలుగురు నిందితుల మొబైల్ ఫోన్లను తన వద్ద ఉంచుకున్నాడు. పార్లమెంట్ సమీపంలో నీలమ్, అమోల్ ఆందోళన చేస్తుండగా ఆ వీడియోను లలిత్ ఫోన్లో రికార్డ్ చేశాడు. భద్రతా సిబ్బంది వారిని పట్టుకోగానే నిందితులదరి ఫోన్లతో లలిత్ అక్కడి నుంచి రాజస్థాన్ పరారయ్యాడు. అనంతరం ఆ వీడియోను బంగాల్‌కు చెందిన ఓ ఎన్జీఓ సభ్యురాలికి పంపినట్లు పోలీసులు గుర్తించారు. గతంలో లలిత్ తమ ఎన్జీఓతో కలిసి పనిచేశాడని పార్లమెంట్ వద్ద ఆందోళనకు సంబంధించి తనకు వాట్సప్‌లో ఓ వీడియో షేర్ చేసి దాన్ని వైరల్ చేయమని మెసేజ్ చేశాడని ఎన్జీఓ సభ్యురాలు తెలిపారు.