Parliament Security Breach Case :దేశ ప్రజాస్వామ్య సౌధమైన పార్లమెంట్‌లో అలజడి రేపిన ఘటనలో కీలక విషయాలు బహిర్గతమవుతున్నాయి. మూడంచెల భద్రతా వ్యవస్థను దాటి నిందితులు కలర్ గ్యాస్ లోపలికి ఎలా తీసుకెళ్లారన్న ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. నిందితులు వీటిని లోపలకు ఎలా తీసుకెళ్లారో పోలీసులు FIRలో పేర్కొన్నారు. నిందితులు బూట్ల కింద ఉండే సోల్‌ను కట్ చేసి అందులో ఈ గ్యాస్ క్యానిస్టర్లను అమర్చి లోక్‌సభ లోపలకు తీసుకెళ్లినట్లు వెల్లడించారు. నిందితులు లఖ్‌నవూలో ప్రత్యేక స్పోర్ట్స్ బూట్లు, ముంబయిలో గ్యాస్ క్యాన్లను కొనుగోలు చేశారు. ఇద్దరు నిందితులు స్పోర్ట్స్ షూ ఎడమ అరికాళ్ల వద్ద మందంగా ఉండే షూ సోల్‌ను కట్ చేశారు. అనంతరం ఆ ఖాళీలో గ్యాస్ క్యానిస్టర్లను అమర్చి మళ్లీ రబ్బర్‌ను అతికించారు. కుడి కాలు షూను కూడా కత్తిరించినా అందులో ఎలాంటి వస్తువులు లభించలేదని పోలీసులు తెలిపారు. అనంతరం చెకింగ్‌కు దొరకకుండా లోక్‌సభలోకి ప్రవేశించిన ఈ ఇద్దరు అదును చూసుకుని లోక్‌సభలోకి దూకారు. అనంతరం షూల నుంచి గ్యాస్ కెనాన్లను బయటకు తీసి పొగ వచ్చేలా చేశారు.
లోక్‌సభలో నిందితులు వాడిన గ్యాస్ క్యానిస్టర్లను డోర్లు మూసి ఉన్న ప్రదేశాల్లో వినియోగించకూడదని, వాడేముందు కళ్లజోడు, గ్లౌజులు ధరించాలన్న నిబంధనలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. లోక్‌సభలో అలజడి రేపిన మనోరంజన్, సాగర్ శర్మ నుంచి కరపత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. లోక్‌సభలోకి తీసుకువెళ్లిన కరపత్రాలలో త్రివర్ణ పతాకం, హిందీ, ఇంగ్లీష్‌లో నినాదాలు ఉన్నాయని వెల్లడించారు.
'లలిత్ ఝాకు వారం రోజుల రిమాండ్'
మరోవైపు, పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన కేసులో కీలక నిందితుడైన లలిత్ ఝాను పోలీసులు దిల్లీ కోర్టులో ప్రవేశపెట్టారు. నిందితుడు పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన ఘటనలో కీలక సూత్రదారి అని, అతడిని 15 రోజుల పోలీసుల కస్టడీకి ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. అయితే.. దిల్లీ కోర్టు జడ్జి హర్దీప్ కౌర్ నిందితుడు లలిత్ ఝాకు వారం రోజులపాటు పోలీసు కస్టడీ విధించారు. గురువారం పార్లమెంట్‌లో అలజడి కేసులో మనోరంజన్, సాగర్ శర్మ, అమోల్ ధన్‌రాజ్ శిందే, నీలం దేవికి ఇప్పటికే వారం రోజుల కస్టడీ విధించింది కోర్టు.
'చిన్నప్పటి నుంచి వివాదాలకు దూరంగా'
పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన కేసులో లలిత్ ఝా ఉండడంపై అతడి సోదరుడు శంభు ఝా స్పందించారు. తన సోదరుడు ఈ వివాదంలో ఎలా చిక్కుకున్నాడో తమకు తెలియదని అన్నారు. అతడు చిన్నప్పటి నుంచి వివాదాలకు దూరంగా ప్రశాంతంగా ఉండేవాడని చెప్పారు. టీవీ ఛానల్లో నిందితుడిగా లలిత్ ఝా ఫొటోలను చూసి కుటుంట సభ్యులు ఆశ్చర్యపోయామని తెలిపారు.
దద్దరిల్లిన ఉభయసభలు- సోమవారానికి వాయిదా
లోక్‌సభలో భద్రతా వైఫల్యానికి సంబంధించిన ఘటనపై దద్దరిల్లిన పార్లమెంటు ఉభయ సభలు సోమవారానికి వాయిదాపడ్డాయి. శుక్రవారం ఉదయం 11గంటలకు లోక్‌సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష ఎంపీలు ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. లోక్‌సభలో భద్రతా వైఫల్యానికి బాధ్యతగా కేంద్ర హోం మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. భద్రతా వైఫల్యంపై చర్చ జరగాలని నినాదాలు చేశారు. ఆగంతకులను పాసులు జారీచేసిన బీజేపీ ఎంపీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విపక్ష ఎంపీల నినాదాలతో ప్రశ్నోత్తరాలకు అంతరాయం కలగడం వల్ల స్పీకర్ ఓం బిర్లా స్థానంలో ఉన్న రాజేంద్ర అగర్వాల్ సభను తొలుత మధ్యాహ్నం 2గంటల వరకు వాయిదా వేశారు. ఆ తర్వాత తిరిగి సమావేశమైనా పరిస్థితిలో మార్పు లేకపోవటం వల్ల సభ సోమవారానికి వాయిదా పడింది.
అటు రాజ్యసభ కూడా సోమవారానికి వాయిదాపడింది. ఉదయం 11 గంటలకు సభ సమావేశంకాగానే భద్రతా వైఫల్యంపై విపక్ష సభ్యులు ఇచ్చిన నోటీసులను తిరస్కరిస్తున్నట్లు ఛైర్మన్ జగదీశ్ ధన్‌ఖడ్ ప్రకటించారు. దీంతో విపక్ష ఎంపీలు భద్రతా వైఫల్యంపై చర్చకు పట్టుపట్టడం సహా టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్‌పై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. సభలో గందరగోళ పరిస్థితులు నెలకొనడం వల్ల ఛైర్మన్ ధన్‌ఖడ్ తొలుత మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదావేశారు. ఆ తర్వాత కూడా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకపోవటం వల్ల సభను సోమవారానికి వాయిదా వేశారు.