Parliament Security Breach Accused Family Members :ప్రజాస్వామ్య వేదికైన పార్లమెంటులోని లోక్‌సభలోకి ఇద్దరు దుండగులు ప్రవేశించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనను అధికార పార్టీతో సహా ప్రతిపక్షాలు ఖండించాయి. మరోవైపు నిందితుల కుటుంబాలు కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించాయి. తమ వారు చేసిన పనికి తాము సిగ్గుపడుతున్నట్లు వెల్లడించాయి. నిజంగా తప్పు చేసి ఉంటే తమవారిని కఠినంగా శిక్షించాలని వారు కోరారు. సందర్శకుల గ్యాలరీ నుంచి లోక్‌సభలోకి దూకిన ఇద్దరు నిందితుల్లో ఒకరైన సాగర్ శర్మ మేనమామ ఈ కుట్ర వెనుక పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న వ్యక్తులు ఉన్నారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. ఏమి జరిగిందో తమకు తెలియదని దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలని అన్నారు.
"సాగర్‌ను ఈ కుట్రలోకి లాగారు. ఈ కుట్రలో పెద్ద పెద్ద పదవుల్లో ఉండే వ్యక్తుల హస్తం ఉండి ఉంటుంది. ఆ పెద్ద వ్యక్తులే సాగర్‌ను ఈ కుట్రలో ఇరికించి ఉంటారు. చిన్న చిన్న వ్యక్తులే ఇరుక్కుంటారు. పెద్ద వ్యక్తులు తప్పించుకుంటారు. ప్రభుత్వం దీనిపై సమగ్ర విచారణ జరపాలి. నా సోదరికి సాగర్ ఒక్కడే కుమారుడు. సాగర్ బయట తిరిగే వ్యక్తికాడు. ఫేస్‌బుక్ లాంటి సామాజిక మాధ్యమాల్లోనే ఇతర నిందితులతో పరిచయం ఏర్పడి ఉంటుంది. సాగర్ వంటి చిన్న వ్యక్తుల వద్ద రాష్ట్రాలు దాటి తిరగడానికి డబ్బులు ఎక్కడ నుంచి వస్తాయి."
-ప్రదీప్ శర్మ, నిందితుడు సాగర్ మేనమామ
'నా కుమారుడు చాలా మంచివాడు'
తమ కుమారుడి చర్యను మరో నిందితుడైన మనోరంజన్ తండ్రి దేవరాజే గౌడ్ ఖండించారు. తన కుమారుడు మనోజ్ చాలా మంచివాడని ఎల్లప్పుడూ సమాజానికి మంచి చేయాలని కోరుకునేవాడని తెలిపారు. తన కుమారుడు నిజంగా తప్పు చేసి ఉంటే అతడిని ఉరి తీయాలని కోరారు.
"నా కొడుకు మంచి అబ్బాయి. అతనికి మంచి విద్య, జ్ఞానాన్ని అందించాము. అతను ఎందుకు చేశాడో మాకు తెలియదు. నా కుమారుడైనా బయటవాళ్లు అయినా ఎవరైనా సరే చేసింది తప్పు. దీన్ని నేను ఖండిస్తున్నాను."
-దేవరాజే గౌడ్, మనోరంజన్ తండ్రి
'మనోరంజన్‌కు ఎలాంటి నేర నేపథ్యం లేదు'
మరోవైపు పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన ఘటనలో నిందితుడైన మనోరంజన్‌కు ఎలాంటి నేర నేపథ్యం లేదని పోలీసు వర్గాలు తెలిపాయి. 'భగత్ సింగ్ ఫ్యాన్ క్లబ్'తో అతడికి సంబంధం ఉన్నట్లు తేలిందని వెల్లడించాయి. మనోరంజన్‌కు విప్లవ భావాలు ఉన్నాయని పేర్కొన్నాయి.