Parliament Security Breach Accused :లోక్‌సభలో అలజడి సృష్టించిన కేసులో అరెస్టైన నిందితులు అందరూ చంద్రశేఖర్ ఆజాద్, భగత్‌సింగ్ వంటి స్వాతంత్య్ర యోధుల పేర్లతో ఏర్పడిన ఆరు వాట్సప్ గ్రూపుల్లో సభ్యులుగా ఉన్నారని పోలీసులు వెల్లడించారు. నిత్యం వీరు స్వాతంత్య్ర సమర యోధుల ఆలోచనలు, ఆదర్శాల గురించి చర్చించుకుంటారని తెలిపారు. వాటికి సంబంధించిన వీడియో క్లిప్పులను కూడా సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటున్నారని పేర్కొన్నారు.
బ్రిటిష్ పాలకుల చట్టాలను నిరసిస్తూ పార్లమెంట్లో పొగ బాంబు వేసిన భగత్ సింగ్ చర్యను పునరావృతం చేసేందుకు ఆరుగురు నిందితులు నిర్ణయించుకున్నారని పోలీసులు తెలిపారు. దానిని అమలు చేసేందుకు యత్నించారని పేర్కొన్నారు. పార్లమెంట్లో భద్రతను చేధించే విషయమై నిందితులు సిగ్నల్స్ యాప్ ద్వారా సంభాషించుకున్నారని పోలీసులు తెలిపారు. గత ఏడాది మైసూరులో నిందితులందరూ భేటీ అయ్యారని, ఇందుకోసం నిందితులకు ప్రయాణా ఖర్చులను మైసూరుకు చెందిన మనోరంజన్ భరించారని వివరించారు.
దర్యాప్తు మరింత ముమ్మరం
పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన కేసులో అరెస్టయిన ప్రధాన నిందితుడు లలిత్ ఝా గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు దిల్లీ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా దిల్లీ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం కోల్‌కతా వెళ్లింది. ప్రధాన నిందితుడు లలిత్ ఝా బస చేసిన కోల్‌కతాలోని బాగుహతి ప్లాట్ వద్దకు వెళ్లి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.