భారత్.. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా కొనసాగుతూనే ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ధరల పెరుగుదలపై లోక్‌సభలో జరిగిన చర్చ సందర్భంగా మాట్లాడిన మంత్రి.. దేశంలో ఆర్థిక సంక్షోభం వచ్చే అవకాశమే లేదన్నారు. వృద్ధి నెమ్మదించే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. ద్రవ్యోల్బణాన్ని 7శాతం కన్నా తక్కువకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వివరించారు నిర్మల. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా వంటనూనెల ధరలు గణనీయంగా తగ్గాయని తెలిపారు.
"ప్రపంచ సంస్థల నివేదికల ప్రకారం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో భారత్ ఒకటి. బ్యాంకుల్లో నిరర్ధక ఆస్తులు ఆరేళ్ల కనిష్ఠానికి చేరుకున్నాయి. దేశ జీడీపీ-అప్పుల నిష్పత్తి సైతం చాలా దేశాలకంటే తక్కువగా ఉంది. జులైలో 1.49 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైంది. జీఎస్టీ ప్రవేశపెట్టిన తర్వాత ఇది రెండో అత్యధికం. మహమ్మారి, రెండోవేవ్, ఒమిక్రాన్, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, చైనాలో లాక్డౌన్.. ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లోనూ ద్రవ్యోల్బణాన్ని ఏడు శాతానికి దిగువనే ఉంచగలిగాం. దీన్ని గుర్తించాలి. కరోనా లాంటి మహమ్మారిని ఇదివరకు ఎన్నడూ మనం చూసింది లేదు. కరోనా సమయంలో ప్రజల కోసం అందరూ కలిసికట్టుగా పనిచేశారు. ఎంపీలతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు తమ వంతు పాత్ర పోషించాయి. లేదంటే, ప్రపంచదేశాలతో పోలిస్తే మనం మెరుగైన స్థితిలో ఉండేవాళ్లం కాదు. ప్రతికూల పరిస్థితుల్లోనూ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా నిలవగలిగాం. ఈ ఘనత దేశప్రజలదే."
-నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి