Parliament New Uniform : పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సమయంలో సిబ్బంది కొత్త యూనిఫాం ధరించనున్నారు. ఈ యూనిఫాంను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (NIFT) ప్రత్యేకంగా రూపొందించింది. ఇది నెహ్రూ జాకెట్ల మాదిరిగా ఊదా ఎరుపు రంగు లేదా గులాబీ రంగులో ఉంటాయి. పువ్వుల డిజైన్‌తో ముదురు గులాబీ రంగులో ఉంటాయి. ఉద్యోగులు ధరించే ప్యాంట్లు ఖాకీ రంగులో ఉంటాయి. మరికొన్ని మార్పులతో భారతీయ సంస్కృతికి అద్దం పట్టేలా డిజైన్ చేశారు. ఉభయ సభల్లో కూడా మణిపురి తలపాగాలు ధరించేలా నిర్ణయించారు. పార్లమెంట్ భవనంలో ఉన్న భద్రతా సిబ్బందికి సఫారీ సూట్లకు బదులుగా మిలటరీ తరహాలో డిజైన్ ఉంటుందని కథనాలు వస్తున్నాయి.
కాగా.. పార్లమెంట్సిబ్బంది యూనిఫాంపై కమలం పువ్వు గుర్తు ఉన్నట్లు వస్తున్న వార్తలపై కాంగ్రెస్, ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వానికి ఏదో అజెండా ఉందని.. అందుకే యూనిఫాం మార్చిందని కాంగ్రెస్ నేత రషీద్ కిద్వాయ్ ఆరోపించారు. 'యూనిఫాంలో మార్పులు చేయాలంటే కమలం పువ్వు డిజైన్ ఎందుకు? బీజేపీ ప్రభుత్వం దేశం మొత్తాన్ని కాషాయ రంగులోకి మార్చాలనుకుంటోందా?' అని కిద్వాయ్ ప్రశ్నించారు.
మరోవైపు, ప్రజాస్వామ్య దేవాలయంగా భావించే పార్లమెంట్‌లోకేంద్రం కాషాయీకరణ, అజెండా రాజకీయాలకు పాల్పడుతోందని ఆర్జేడీ నేత మనోజ్ ఝా ఆరోపించారు. పార్లమెంట్ సిబ్బంది.. తమ పార్టీ దుస్తులను ధరించేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు.