తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కరోనాపై కేంద్రానివి తప్పుడు లెక్కలు!' - rajya sabha Chairman Venkaiah Naidu

కరోనా కట్టడిపై రాజ్యసభలో వాడీవేడి చర్చ జరిగింది. మహమ్మారిని ఎదుర్కోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విపక్షాలు ఆరోపించగా.. అధికార పక్షం తిప్పికొట్టింది.

Rajya Sabha
రాజ్యసభ

By

Published : Jul 20, 2021, 6:00 PM IST

Updated : Jul 20, 2021, 7:03 PM IST

కరోనా కట్టడిలో ప్రధాని నరేంద్ర మోదీ విఫలమైనా... స్వయంగా తాను బాధ్యత వహించకుండా ఆరోగ్య మంత్రిని(హర్షవర్ధన్​ను) బలిపశువును చేశారని కాంగ్రెస్​ ధ్వజమెత్తింది. రాజ్యసభలో కరోనాపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేత మల్లికార్జున​ ఖర్గే ఈమేరకు కేంద్రంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మోదీని నమ్మి ప్రజలు దీపాలు వెలిగించి, పళ్లేలు మోగిస్తే ఆయన మాత్రం వారిని నిరాశపర్చారని మండిపడ్డారు.

"అప్పట్లో కొవిడ్‌ తగ్గలేదు. ప్రజలు చనిపోతూ ఉన్నారు. ఆక్సిజన్‌ లేదు. వెంటిలేటర్‌లు లేవు. కానీ మీరు(ప్రభుత్వ పెద్దలు) మాత్రం చప్పట్లు కొట్టడంలో నిమగ్నమయ్యారు. దీపాలు వెలిగించడంలో నిమగ్నమయ్యారు. దీని ద్వారా కరోనాపై మీరు ఆందోళనగా లేరని, ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తున్నారని తెలుస్తోంది. ఈ సమస్య ఇతర దేశాల్లో కూడా ఉండేది. కానీ వారంతా కరోనా రెండో దశను ఎదుర్కొనేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఇక్కడ మాత్రం ఎన్నికలు నిర్వహించారు. పెద్ద పెద్ద ప్రసంగాలు చేశారు. సభలు నిర్వహించారు. ఓ వైపు భౌతిక దూరం పాటించాలని, మాస్కు ధరించాలని చెబుతారు. కానీ బంగాల్‌లో మీరు ఏం చేశారు? నిబంధనలను రూపొందించినవారే వాటిని ఉల్లంఘించిన ఘనత ఎవరికైనా ఇవ్వాలంటే అది ప్రభుత్వానికే ఇవ్వాలి."

- మల్లికార్జున ఖర్గే, రాజ్యసభలో ప్రతిపక్ష నేత

'ఎన్నికల వల్లే కేసులు పెరిగాయి'

పెద్దల సభలో కరోనాపై చర్చలో భాగంగా కేంద్రంపై విమర్శలు గుప్పించారు టీఎంసీ ఎంపీ డాక్టర్​ శాంతను సేన్​. 234 అసెంబ్లీ స్థానాలున్న తమిళనాడులో ఒకే దశలో ఎన్నికలు నిర్వహించగా.. 294 నియోజకవర్గాలున్న బంగాల్​లో 8 దశల్లో ఎన్నికలు జరపడాన్ని తప్పుబట్టారు.

"దేశంలో కొవిడ్ రెండో దశలో వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో బంగాల్​లో 8 దశల్లో ఎన్నికలు జరిపారు. దీంతో ఎన్నికల ముందు 2.3 శాతం ఉన్న ఇన్​ఫెక్షన్​ రేటు.. పోలింగ్ అనంతరం 33 శాతానికి పెరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ప్రస్తుతం ఇన్​ఫెక్షన్​ రేటు 1.8 శాతానికి తగ్గింది"

- టీఎంసీ ఎంపీ డాక్టర్​ శాంతను సేన్

'లెక్కలు ఎందుకు దాస్తున్నారు?'

కరోనా మరణాలపై కేంద్ర ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని ఆరోపించారు శివసేన ఎంపీ సంజయ్ రౌత్​.

"కరోనా డేటాను ఎందుకు దాచిపెడుతున్నారు. ఎంత మంది కొవిడ్​తో చనిపోయారో చెప్పండి. ప్రభుత్వ లెక్కల కంటే ఎక్కువ మందే చనిపోయినట్లు నివేదికలు చెబుతున్నాయి."

- శివసేన ఎంపీ సంజయ్ రౌత్​

'మూడోదశను రానివ్వం'

విపక్షాల ఆరోపణల్ని తోసిపుచ్చింది కేంద్రం. దేశంలో కరోనా మూడో దశకు రానివ్వమన్నారు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ. కరోనా కష్ట కాలంలో అన్ని రాష్ట్రాల కేంద్రం అండగా నిలిచిందని పేర్కొన్నారు.

"130 కోట్ల మంది ప్రజలు, అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు.. కరోనా మూడో దశను రానీయబోమని సంకల్పం తీసుకోలేమా? మా సంకల్పం, ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పం.. కరోనా మూడో దశ నుంచి మనల్ని కాపాడుతుంది. దేశాన్ని తయారు చేయడానికి అందరి సహకారంతో పని చేయాలని ప్రధాని అంటూ ఉంటారు. రాబోయే రోజుల్లో ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు కలిసి ఎలా పని చేయాలి అనే అంశాన్ని ఆలోచిస్తాం. పనులు, మనసు, ఆలోచనలతో కలిపి పని చేస్తాం. దాని వల్ల ఎలాంటి మూడో దశ రాబోదు. దీనిలో మేం విజయం సాధిస్తాం."

- మన్‌సుఖ్‌ మాండవీయ, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి

ఉదయం వాయిదాల పర్వం..

అంతకుముందు... పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో రెండోరోజూ రాజ్యసభలో పెగాసస్ వ్యవహారంపై పలువురు విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు. అనంతరం 12 గంటలకు ప్రారంభమైన పెద్దలసభలో.. సభ్యులు తమ ఆందోళనలను కొనసాగించారు. నినాదాలు చేస్తూ కార్యకలాపాలకు అంతరాయం కలిగించారు. దీంతో సభను మరోసారి ఒంటి గంట వరకు వాయిదా వేశారు డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్​.

రెండు సార్లు వాయిదా పడ్డ రాజ్యసభ.. ఒంటిగంటకు తిరిగి సమావేశమైంది. అప్పటివరకు గందరగోళం నెలకొన్న సభ.. ఛైర్మన్​ వెంకయ్యనాయుడు చొరవతో సజావుగా సాగింది. కరోనాపై చర్చ అనంతరం గురువారానికి వాయిదా పడింది.

'ఆక్సిజన్​ కొరతతో ఎవరూ చనిపోలేదు'

మరోవైపు... కరోనా రెండో దశలో ఆక్సిజన్​ కొరతతో ఏ ఒక్కరూ చనిపోలేదని స్పష్టం చేసింది. రాష్ట్రాలకు ఎప్పటికప్పుడు ఆక్సిజన్​ను తగిన మోతాదులో సరఫరా చేసినట్లు పేర్కొంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు.. కొవిడ్​ కేసులు, మరణాలకు సంబంధించిన డేటాను రోజూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు అందజేస్తున్నాయని వెల్లడించింది. ఆ డేటానే వారు ప్రచురించినట్లు తెలిపింది. ఆరోగ్యం.. రాష్ట్రాల సంబంధించిన అంశమని గుర్తు చేసింది.

ఆక్సిజన్​ కొరత కారణంగా రోడ్లు, ఆస్పత్రుల్లో ఎంత మంది కరోనా రోగులు మరణించారని కాంగ్రెస్​ ఎంపీ వేణుగోపాల్ అడిగిన ప్రశ్నకు ఈ మేరకు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చింది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ.

ఇదీ చూడండి:'కరోనా మరణాలు.. కేంద్రం లెక్కలకన్నా 10 రెట్లు అధికం!'

Last Updated : Jul 20, 2021, 7:03 PM IST

ABOUT THE AUTHOR

...view details