పెగసస్ ఫోన్ ట్యాపింగ్ సహా ఇతర అంశాలపై చర్చకు డిమాండ్ చేస్తూ ఆందోళనలు కొనసాగించారు విపక్ష సభ్యులు. దాంతో ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగింది.
లోక్‌సభలో..
లోక్సభ ఉదయం 11 గంటలకు సమావేశం కాగానే.. విపక్ష సభ్యులు పెగసస్ అంశంపై చర్చకు పట్టుపట్టారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమం తర్వాత మిగతా అంశాలు చేపడతామని స్పీకర్ ఓంబిర్లా పేర్కొన్నప్పటికీ.. కాంగ్రెస్ సహా విపక్ష సభ్యులు పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేస్తూ సభ కార్యకలాపాలను అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే.. టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన పీవీ సింధును అభినందించారు స్పీకర్ ఓం బిర్లా. దేశంలోని ఎంతో మంది యువతలో ఆమె స్ఫూర్తి నింపిందని కొనియాడారు.
విపక్షాల ఆందోళనలతో మొదట మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. తిరిగి సమావేశమైనా.. అదే పరిస్థితి కొనసాగటం వల్ల మధ్యాహ్నం 2 గంటలకు, అనంతరం మధ్యాహ్నం 3.30 గంటలకు రెండు సార్లు వాయిదా పడింది. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా విపక్షాలు ఆందోళన కొనసాగించాయి. ఈ సమయంలోనే కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి లేవనెత్తిన అంశాలపై సమాధానం ఇచ్చేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సిద్ధమయ్యారు. అయితే.. మరోవైపు ఆందోళనలు కొనసాగించటం వల్ల కుదరలేదు.
నిరసనల మధ్యే 'జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ (జాతీయీకరణ) సవరణ బిల్లు, 2021' లోక్‌సభలో ఆమోదం తెలిపింది.
అనంతరం సభను మంగళవారం ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు స్పీకర్.
రాజ్యసభలో..
రాజ్యసభ ప్రారంభమైన వెంటనే విపక్షాలు ఆందోళనకు దిగాయి. పెగసస్, సాగు చట్టాలు సహా ఇతర అంశాలపై చర్చించాలని పట్టుబట్టాయి.
ఈ క్రమంలోనే టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన తెలుగు తేజం పీవీ సింధును.. ఛైర్మన్ వెంకయ్య నాయుడు అభినందించారు. వరుసగా రెండు ఒలింపిక్స్ల్లో పతకాలు సాధించిన తొలి మహిళా క్రీడాకారిణిగా సింధు రికార్డు సృష్టించినట్లు కొనియాడారు.
విపక్ష ఎంపీలు బిగ్గరగా నినాదాలు చేయటం వల్ల సభకు అంతరాయం ఏర్పడగా.. మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు ఛైర్మన్ వెంకయ్య నాయుడు. తిరిగి ప్రారంభమైనప్పటికీ.. విపక్షాలు ఆందోళనలు విరమించలేదు. దీంతో మరోమారు సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. ఆ తర్వాత అదే పరిస్థితి కొనసాగటం వల్ల 3.30 గంటలకు వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన తర్వాత విపక్షాలు ఆందోళనలు కొనసాగించాయి. ఆందోళనల మధ్యే రెండు బిల్లులను సభ ముందుకు తీసుకొచ్చింది కేంద్రం. ఇన్లాండ్ వెజల్ బిల్ 2021కు ఆమోదం తెలిపింది రాజ్యసభ.
విపక్ష సభ్యులు ప్లకార్డులు పట్టుకుని వెల్ లోకి వచ్చి నినాదాలు చేశారు. వెనక్కి వెళ్లాలని సభాపతి భువనేశ్వర్ కలిత కోరినప్పటికీ వెనక్కి తగ్గలేదు.. సభను కొనసాగించే పరిస్థితలు లేకపోవటం వల్ల మంగళవారం ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు.