పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో తొమ్మిదో రోజు కూడా విపక్షాల ఆందోళనలు కొనసాగాయి. పెగసస్ వ్యవహారం సహా పలు అంశాలపై చర్చ జరపాలని పట్టుబట్టడం వల్ల ఉభయసభల్లో వాయిదాల పర్వం కొనసాగింది. నిరసనల మధ్యే పలు బిల్లులు ప్రవేశపెట్టింది ప్రభుత్వం.
లోక్సభలో ఇలా..
సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఓం బిర్లా.. ప్రశ్నోత్తరాలను చేపట్టేందుకు సిద్ధం కాగా, పెగసస్ హ్యాకింగ్, సాగుచట్టాలు, ధరల పెరుగుదలపై చర్చకు అనుమతించాలని కాంగ్రెస్ పక్షనేత అధిర్ రంజన్ చౌదరి విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తిని తోసిపుచ్చిన స్పీకర్.. ప్రశ్నోత్తరాలను కొనసాగించగా కాంగ్రెస్ సహా విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ వెల్‌లో ఆందోళన చేపట్టారు. సభ సజావుగా కొనసాగేందుకు సహకరించాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి విజ్ఞప్తి చేసినా విపక్షాలు శాంతించలేదు. విపక్ష సభ్యుల ఆందోళన మధ్యే దేశ రాజధాని, దాని చుట్టపక్కల ప్రాంతాల్లో వాయు నాణ్యత నిర్వహణ బిల్లు-2021, జాతీయ బీమా వ్యాపార జాతీయీకరణ సవరణ బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టింది.
విపక్షాల ఆందోళనతో స్పీకర్ సభను 12 గంటల వరకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా విపక్ష సభ్యులు వెనక్కి తగ్గకపోవడం వల్ల సభను ఆగస్టు 2 వరకు వాయిదా వేశారు.
ఎగువ సభలో..
రాజ్యసభలోనూ అదే పరిస్ధితి కొనసాగింది. సభ ప్రారంభం కాగానే సభ్యుల తీరుపై ఛైర్మన్ వెంకయ్య నాయుడు విచారం వ్యక్తం చేశారు. సభ్యులు ఈలలు వేయడం, మంత్రుల ముందు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలపడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన వెంకయ్య.. సభ గౌరవాన్ని కాపాడేలా ప్రవర్తించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం సభా కార్యక్రమాలను కొనసాగించగా పెగసస్, సాగు చట్టాలపై చర్చకు పట్టుబడుతూ విపక్ష సభ్యులు ఆందోళనకు దిగగా వెంకయ్య సభను 12 గంటల వరకు వాయిదా వేశారు.