Parliament monsoon session live : మణిపుర్ అంశంపై చర్చించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన విపక్ష కూటమికి, అధికార పక్షానికి మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. పాలక, విపక్షాల మధ్య వాగ్యుద్ధంతో పార్లమెంట్లో అదే ప్రతిష్టంభన కొనసాగుతోంది. అవిశ్వాస తీర్మానంపై చర్చించకుండా పార్లమెంట్‌ను మోదీ సర్కారు అవమానిస్తోందని కాంగ్రెస్ పార్టీ మండిపడింది. అవిశ్వాస తీర్మానంపై నోటీసులు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం బిల్లులు ప్రవేశపెట్టడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇతర సమస్యలను తెరపైకి తెచ్చి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి పార్లమెంట్ బయట వ్యాఖ్యానించారు.
"ప్రభుత్వం ముందుగా అవిశ్వాస తీర్మానంపై చర్చించాలి. సభలో ఇతర కార్యకలాపాలకు మేం వ్యతిరేకం కాదు. కానీ, అవిశ్వాస తీర్మానంపైనే ముందుగా చర్చ జరగాలి. అవిశ్వాస తీర్మానానికి అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. దీనిపై నోటీసులు ఇచ్చిన సమయంలో బిల్లులు, పాలసీలు తీసుకొచ్చి పార్లమెంట్‌ను ప్రభుత్వం అవమానిస్తోంది. అవిశ్వాస తీర్మానాన్ని పక్కనబెట్టి ఇతర అంశాలపై చర్చ జరపడం గతంలో ఎన్నడూ చూడలేదు."
-అధీర్ రంజన్ చౌదరి, లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత
Congress vs BJP in India : విపక్ష కూటమి ఎంపీలతో కలిసి మణిపుర్‌ను సందర్శించిన అధీర్.. అక్కడ పరిస్థితి భయంకరంగా ఉందని అన్నారు. మణిపుర్ పరిస్థితిని అర్థం చేసుకునేందుకు అధికార పార్టీ ఎంపీలు ఆ రాష్ట్రాన్ని సందర్శించాలని సూచించారు.
Kharge on PM Modi Manipur : మణిపుర్ అంశంపై చర్చించేందుకు ప్రధానికి సమయం లేనట్లుగా కనిపిస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. 'ప్రచారం కోసం రైళ్లను ప్రారంభించడానికి, ఎన్నికల ర్యాలీలు- బీజేపీ సమావేశాల్లో పాల్గొనడానికి మోదీకి సమయం ఉంది. కానీ మణిపుర్ ప్రజల వేదనపై మాట్లాడేందుకు మోదీకి సమయం ఉండదు. మణిపుర్ పరిస్థితిని చక్కదిద్దే పరిష్కారమేదీ లేనట్లుగా మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. పార్లమెంట్లో సమగ్ర ప్రకటన ఇవ్వకపోవడమే ఇందుకు సాక్ష్యం' అని ఖర్గే ట్వీట్ చేశారు.
"10 వేల మంది చిన్నారులు సహా 50 వేల మంది మణిపుర్ ప్రజలు సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. రిలీఫ్ క్యాంపుల్లో మహిళలకు సరైన సదుపాయాలు లేవు. ఔషధాలు, ఆహారం తగినంతగా లభించడం లేదు. ఆర్థిక కార్యకలాపాలన్నీ ఆగిపోయాయి. చిన్నారులు స్కూళ్లకు వెళ్లలేకపోతున్నారు. రైతులు వ్యవసాయం ఆపేశారు. ఆర్థిక నష్టాలు, మానసిక ఒత్తిళ్లతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు."
-మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు